విశాఖ రాజధాని: పైల్స్ వ్యాధిలా చెప్పుకోలేని బాధ!

ys jagan

వైసీపి ప్రభుత్వం ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూ మళ్ళీ దాని మెడకే చుట్టుకొంటుండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గర్వంగా చెప్పుకోవలసిన అమరావతికి కులం రంగు పూసి మూడు రాజధానుల ప్రతిపాదన చేసి వైసీపి ప్రభుత్వం నవ్వులపాలైంది. విశాఖ రాజధాని చేస్తామంటే దానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది.

ADVERTISEMENT

ఎన్నికలు దగ్గర పడుతున్నందున తమ ప్రభుత్వం విశాఖ రాజధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎలాగైనా రాష్ట్ర ప్రజలను నమ్మించాల్సి ఉంది. కానీ కోర్టులకు చిక్కకూడదు… ఎలా?సిఎం జగన్‌ విశాఖకు మకాం మార్చబోతున్నారంటూ మీడియాకు లీకులు ఇస్తూ ఏడాదిన్నర కాలక్షేపం చేసేసింది.

సిఎం జగన్‌ స్వయంగా పెట్టుకొన్న డిసెంబర్‌ ముహూర్తం మళ్ళీ దగ్గర పడుతోంది కనుక ఆ విశాఖ రాజధాని డ్రామా మళ్ళీ మొదలైంది. విశాఖలో ఐ‌టి కంపెనీల కోసం నిర్మించిన మిలీనియం టవర్స్‌ భవనాన్ని మంత్రులు, వివిద శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు కేటాయిస్తూ సిఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు ఐ‌టి కంపెనీల కోసం నిర్మించిన భవనాలను వాటికి కేటాయించకుండా ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవడం ఏమిటి?అంటే రాష్ట్రానికి ఐ‌టి కంపెనీలు వాటితో ఉద్యోగాల కల్పన అవసరం లేదని వైసీపి ప్రభుత్వం భావిస్తోందా? అనే సందేహం కలుగుతుంది.

విశాఖ రాజధాని కోసం వైసీపి ప్రభుత్వం ఐ‌టి కంపెనీలను త్యాగం చేసిందనుకొన్నా, విశాఖ రాజధాని కోసమే ఈ ఏర్పాట్లన్నీ అని ధైర్యంగా చెప్పలేకపోతోంది. సుప్రీంకోర్టుకి భయపడి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిని పర్యవేక్షించుకే ఇదంతా అని చెప్పుకొంటోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ‘మా రాజధాని ఇది’ అని ధైర్యంగా చెప్పుకోలేకపోవడం ఎంత దౌర్భాగ్యం?

ఋషికొండను పరదాలు కప్పి దాచేసిన్నట్లు, ఈ భాగోతాన్ని కూడా ‘ఉత్తరాంధ్ర అభివృద్ధిని పర్యవేక్షించేందుకు’ అనే ముసుగు వేసి దాచేయాలనుకొంటోంది.

అయితే విశాఖలో రాజధాని ఏర్పాటు చేశామని రేపు చెప్పుకోకుండా ఉండగలదా?చెప్పుకొంటే సుప్రీంకోర్టుకి దొరికిపోదా?కోర్టులో మొట్టికాయలు పడకుండా ఉంటాయా? చెప్పుకోలేకపోతే ఇన్ని డ్రామాలు ఆడి ఏం సాధించిన్నట్లు?రేపు ఎన్నికలలో ప్రజలకు ఏమని చెప్పుకొంటుంది?విశాఖ రాజధాని వైసీపికి పైల్స్ వ్యాధిలా మారింది. పైకి నవుతున్నా పంటి బిగువున ఆ నొప్పి, బాధ భరించక తప్పడం లేదు పాపం!

ADVERTISEMENT
Latest Stories