ప్రజా వేదిక కూల్చి వేతతో, రాజధాని మార్పుతో పాలన మొదలుపెట్టిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ తాననుకున్న విశాఖకు రాజధానిని తరలించనూలేదు. అలాగే తానొద్దనుకున్న అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను పరామర్శించను లేదు.జగన్ నిర్ణయంతో ఆశతో ఒక ప్రాంత వాసులు, ఎదురుచూపులతో మరొక ప్రాంత వాసులు కాలం వెల్లదీస్తున్నారు.
ఒక ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చి మరో ప్రభుత్వానికి ఓటేస్తే జరిగే పరిణామాలేమిటో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు అమరావతికి భూములిచ్చిన రైతు కుటుంబాలు. పంటలు పండించడానికి రైతుల దగ్గర భూమి లేదు. అలాగే ప్రభుత్వానికి ఇచ్చిన భూమికి కౌలు రాదు. “రెండికి చెడ్డ రేవడి” మాదిరి తయారయ్యింది రాజధాని రైతుల పరిస్థితి. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో రోడ్డు మీదకు వచ్చిన రాజధాని రైతుల కుటుంబాలు ఇప్పటికి ఆ రోడ్డు మీదే తమ పోరాటాలు కొనసాగిస్తూ సమస్య పరిష్కారం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ నెల 17 తో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అమరావతి ఉద్యమం. ఈ నేపథ్యంలో ఉద్యమకారులంతా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో భారీ బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. అయితే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ హాజరుకానున్నట్టు సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఈ ఎన్నికలకు రాజధానే ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రం కానుంది.ప్రతిపక్ష పార్టీలు ఆశిస్తున్నట్టు, అధికార పార్టీ భయపడుతున్నట్టు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితే ఏపీ రాజధాని సమస్యకు పరిష్కారం ఏమిటి అనే ప్రశ్నకు ఈ సభలో సమాధానం దొరకనుంది.
2024 లో జరిగే ఎన్నికలు ఏపీ రాజధాని ఎంపికకు అగ్నిపరీక్ష వంటిదనే చెప్పాలి. రెండు పార్టీలు..,ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయాలు..,మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలు ..,సుమారు తొమ్మిది కోట్ల జనాభా గుర్తింపు. వీటన్నిటికీ 2024 లో జరిగే ఎన్నికలే కొలమానం కానుంది. ఏపీ రాజధాని జగన్ నిర్ణయం ప్రకారం “సాగర తీరానికి వెళ్లనుందా..?”లేక బాబు నిర్ణయించినట్టు “కృష్ణా తీరానికి రానుందా…?” అనే ఉత్కంఠకు తెరపడే సమయం దగ్గరలోనే ఉంది.
అయితే 2019 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో వైసీపీ మొదలుపెట్టిన ఈ మూడు రాజధానుల చదరంగానికి 2024 లో జరిగే ఎన్నికల సాక్షిగా టీడీపీ – జనసేన పార్టీలు చెక్ పెట్టాలని భావిస్తున్నాయి.అయితే ఈ నిర్ణయంతో నెగ్గేదెవరో?తగ్గేదెవరో? కానీ ఈ రాజకీయ క్రీడల మధ్య మరొక ప్రాంత వాసులు నలిగిపోకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిద్దాం.




