YS Jagan Betrays YS Sharmila And Comments On Chandrababu

జగన్మోహన్‌ రెడ్డి నేడు విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించి అక్కడ అతిసార వ్యాధితో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “ఆస్తి పంపకాల గొడవలు ఏ కుటుంబంలో లేవు? ప్రతీ కుటుంబంలో ఉంటాయి. అలాగే మా కుటుంబంలో కూడా ఉన్నాయి. ప్రజల దృష్టిని మళ్ళించేందుకే సిఎం చంద్రబాబు నాయుడు మా కుటుంబ వ్యవహారాల గురించి మా ముగ్గురి ఫోటోలు పెట్టి వార్తలు వ్రాయిస్తూ దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఇకనైనా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడుకి మనవి చేస్తున్నాను,” అని జగన్‌ అన్నారు.

జగన్‌, భారతీ దంపతులు తమ సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో తల్లికి, చెల్లికి వాటాలు ఇచ్చేందుకు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు స్వయంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌కి తెలియజేసి, అదే విషయం తల్లికి, చెల్లికి తెలియజేస్తూ నోటీసులు పంపించారు. అప్పుడే ఈ విషయం బయటకు పొక్కింది.

Also Read – అప్పుడు కేసీఆర్‌, ఇప్పుడు కవిత… వాడేసుకుంటున్నారుగా!

ఆ నోటీసుకి జవాబుగా “జగనన్నా.. నువ్వు తల్లిని, చెల్లిని మోసం చేయడానికి వెనకాడటం లేదంటూ వైఎస్ షర్మిల అన్నకి ఘాటుగా లేఖ వ్రాశారు. దానిలో వారి తల్లి విజయమ్మ కూడా సంతకం చేశారు.

వైఎస్ కుటుంబంలోని ఆస్తుల పంచాయితీ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇప్పుడు ఈ వార్తలు రెండు తెలుగు రాష్ట్రాలలో, సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి. కానీ తాను ప్రజాసమస్యలపై పోరాడేందుకు బయలుదేరిన ప్రతీసారి సిఎం చంద్రబాబు నాయుడు ఈవిదంగా ఏదో ఓ సంచలనవార్తలు లీక్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్మోహన్‌ రెడ్డి ఆరోపించడం విశేషం.

Also Read – వైసీపీ లెక్క తప్పుతుందా.?


జగన్‌ తప్పు చేస్తున్నారని తల్లీ, చెల్లీ లిఖితపూర్వకంగా చెపుతుంటే, చంద్రబాబు నాయుడుని జగన్‌ తప్పు పడుతున్నారు. తల్లికి, చెల్లికి ఆస్తులలో వాటా ఇవ్వకుండా నామం పెట్టిన జగన్‌ సిఎం చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటం విడ్డూరంగా లేదూ?