నిన్న విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాకరించారు. జగన్ వాంగ్మూలం తీసుకునేందుకు ఏపీ పోలీసుల బృందం ఈ రోజు హైదరాబాద్‌కు చేరుకుంది. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న జగన్ కలుసుకుని వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు.
[m9ad]
అయితే తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్.. వారికి వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. ఏదైనా ఏజెన్సీ వారితో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు. దీంతో పోలీసుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది. అయితే ముఖ్యమంత్రి కావాలి అనుకునే వ్యక్తికి ఒక వ్యవస్థపై నమ్మకం లేకపోవడం, ఇంత సీరియస్ ఘటన జరిగినప్పుడు పోలీసులకు సహకరించే విచక్షణ లేకపోవడం శోచనీయం.
అధికారంలో ఉండే పార్టీలు మారుతూ ఉంటాయి కానీ వ్యవస్థలు మాత్రం పర్మనెంట్ గా ఉంటాయి. ఉండాలి కూడా. ఇదే ఆంధ్ర పోలీసు దాదాపుగా ఏడాది పాటు జగన్ పాదయాత్రకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసారు. ఇప్పుడు కేంద్ర బలగాల ఆధీనంలో ఉండే ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనకు పోలీసులను నిందించి వారి ఆత్మస్త్యర్యాన్ని దెబ్బ తీస్తే ఆ నష్టం జగన్ కే.
మరోవైపు జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఐదురోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనితో పాదయాత్రను వాయిదా వెయ్యనున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోనే ఆయన కొన్ని రోజుల పాటు రెస్టు తీసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



