ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిలో ఏమి చూసి వైసీపికి అంత భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారో తెలీదు కానీ ప్రజలు ఇచ్చిన ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పక తప్పదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద నమ్మకంతో ‘చంచల్‌గూడా బ్యాక్ గ్రౌండ్’ కూడా పట్టించుకోకుండా ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు, ఈసారి తన పాలన, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి ప్రజలు ఓట్లు వేసేలా చేసుకొనే గొప్ప అవకాశం జగన్‌కు లభించింది.
కానీ ప్రజావేదిక కూల్చివేతతో తన పాలనకు టీజర్ చూపారు. సినిమా దర్శకులైనా మద్యలో కధ మరిచిపోయి వేరే ఏదో తీసి బోర్లాపడతారేమో కానీ జగన్ మాత్రం దిక్కులు చూడకుండా ‘సంక్షేమ పధకాల టైట్ రోప్ వాక్’ చేస్తూనే ఉన్నారు.
తొలిరోజు నుంచే 2024లో జరుగబోయే ఎన్నికలలోగా టిడిపి, జనసేనల నుంచి పోటీ లేకుండా చేసేందుకు ఏమేమి చేయాలో అన్నీ చేశారు. లక్షల మంది వాలంటీర్లతో ప్రైవేట్ సైన్యాన్ని, వారిని సమన్వయపరిచేందుకు ఎక్కడికక్కడ సచివాలయాల కోటలని ఏర్పాటు చేసుకున్నారు. 2024 కోసం 2019 నుంచే ఐప్యాక్ కూడా పెట్టుకున్నారు. దాంతో రోజు విడిచి రోజూ సర్వేలు చేయించుకుంటూనే ఉన్నారు. మంత్రులు, యంపీలు, ఎమ్మెల్యేలను మార్చుకుంటూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టడం, కేసులు, వేధింపులు వగైరాల కధలు చెప్పుకోవాలనే మిగిలిన ఈ పుణ్యకాలం కూడా సరిపోదు. అన్ని ఉన్నాయి.
పోసాని, ఆర్జీవీ వంటివాళ్ళని తెచ్చి పెట్టుకొని వారిచేత కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల గురించి అవహేళన చేయిస్తూనే ఉన్నారు. 2016 నుంచి 2024 వరకు ఏకంగా ఏడు సినిమాలు (వంగవీటి, యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, యాత్ర-2, వ్యూహం, శపధం) తీసి జనాల మీదకు వదులుతున్నారు.
ఇన్ని సినిమాలకు సమాధానంగా ఒకే ఒక్క ‘రాజధాని ఫైల్స్’ సినిమా ఇంకా విడుదల కాక ముందే వైసీపి నేతలకు చెమటలు పట్టిస్తోంది.
ఈ పధకాలు, ప్రయత్నాలు, సినిమాలు, వ్యూహాలు… అన్నీ 2024 ఎన్నికలలో గెలిచేందుకే…. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకే… అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 2024 ఎన్నికల గురించి 2019 నుంచే ఇంత దూరదృష్టితో ఆలోచించగలిగినప్పుడు, అదేదో రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచించవచ్చు కదా?రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపితే నేడు ఇంత ఆందోళన, ఇన్ని తిప్పలు పడాల్సిన అవసరమే లేదు కదా? ఇన్ని సినిమాలు, ఈ ఆర్జీవీలు, పోసానులు అవసరమే ఉండేది కాదు కదా?






