ఆర్థిక నేరాలతోపాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై అభియోగాలను త్వరితగతిన తేల్చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. దీనిపై అమికస్ క్యూరీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది. దీనితో తమ కోర్టు పరిధిలో ఉన్న అటువంటి పెండింగ్ కేసులు అన్నీ రోజువారీ హియరింగులు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
సీబీఐ, ఏసీబీ ప్రత్యేక కోర్టుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులు అన్నీ తెలంగాణ హై కోర్టులోనే ఉన్నాయి. ఇక నుండి వీటికి రోజు వారీ హియరింగ్ జరగనుంది.
మొత్తంగా ఈ కేసులలో సీబీఐ 11 చార్జిషీట్లు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐదు చార్జిషీట్లు దాఖలు చేసింది. విశేషమేమిటంటే… ఇప్పటిదాకా ఏ ఒక్క కేసులోనూ కోర్టులో అసలు విచారణ మొదలుకాలేదు. ముఖ్యమంత్రైన తరువాత ఒక్కసారి కూడా కోర్టు కు వెళ్లకుండా జగన్ సహాయనిరాకరణ చేస్తున్నారు.
ఈ తాజాగా పరిణామాల నేపథ్యంలో ఇక హాజరు కాకతప్పదేమో. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ ఉన్నఫళంగా రేపు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఈ కేసుల రోజూ వారీ విచారణ కారణంగానే జగన్ ఉన్నఫళంగా మోడీ దగ్గరకు పరిగెట్టుకుని వెళ్తున్నారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.




