ఒకటే మాట..ఒకటే పాట… మడమ తిప్పేదలే…

YS_Jagan_Mohan_Reddy_Narendra_Modiసిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్‌ షెకావత్‌లతో వరుసగా భేటీ అయ్యారు. అక్కడ ఎవరిని కలిసినా ఒకటే మాట..ఒకటే పాట పాడారు. ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు పోలవరంకు నిధులు (రూ.55, 548.87 కోట్లు), దాని రియింబర్స్‌మెంట్ పద్దులో (రూ.905.51 కోట్లు), పెండింగ్ బిల్లులు, రైతుల రుణమాఫీకి రెవెన్యూ గ్యాప్ వగైరాలకు (రూ.35,625 కోట్లు), తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు (రూ.6,667.86 కోట్లు), రుణ పరిమితిపై ఆంక్షలు తొలగింపు వగైరా వగైరాల గురించి ప్రధానంగా మాట్లాడారు.

త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికకు వైసీపీ మద్దతు అవసరం కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి కోరినట్లు అన్ని వేలకోట్లు కాకపోయినా, ప్రతీ నెల ఇస్తున్నట్లే ఎంతో కొంత ఇవ్వడం ఖాయం.

ADVERTISEMENT

సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు, విభజన హామీలలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కనుక అక్కడ నిర్మిస్తున్న స్టీల్ ప్లాంటుకి ఏపీఎండీసీ ద్వారా నిరంతరాయంగా ఐరన్‌ ఓర్ సరఫరా చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.

విశేషమేమిటంటే కడపలో కట్టబోతున్న స్టీల్ ప్లాంటు గురించి ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడారు కానీ విశాఖలో దశాబ్ధాలుగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంటుని అమ్మవద్దని చెప్పలేకపోయారు. అయినా నడుస్తున్న ప్లాంటును అమ్ముకొని కొత్తగా వేరే చోట కట్టుకోవడం ఏమి వివేకమో అర్ధం కాదు.

కడపలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం మంచిదే. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంటుని కూడా అమ్ముకోకుండా కాపాడుకోగలిగితే ఇంకా మంచిది కదా?వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వైసీపీ విరుద్దమని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు కదా?మరి ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంటుని అమ్మవద్దని చెప్పలేదు?

విశాఖ నగరమన్నా, విశాఖ ప్రజలన్నా తనకు ఎంతో ఇష్టమని చెపుతూ వైజాగులో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టేందుకు సిద్దపడిన సిఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోడీని నెలనెలా కలుస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంటుని అమ్మవద్దని గట్టిగా ఎందుకు చెప్పడం లేదు?

కేంద్రం అభిమతానికి భిన్నంగా వెళితే రాజకీయంగా, న్యాయపరంగా తనకు, పార్టీకి ఇబ్బందులు వస్తాయనే భయంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోకపోతే దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడతారు. అప్పుడు వచ్చే ఎన్నికలలో వారిని వైసీపీకి ఓట్లు వేయమని ఏ మొహం పెట్టుకొని అడగగలదు? ఆలోచిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories