ఏ దేశం… ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ప్రజలందరికీ ఏ ప్రభుత్వమూ ఉద్యోగాలు కల్పించలేదు కానీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలను రప్పించి వీలైనంత ఎక్కువ ఉద్యోగావకాశాలు సృష్టించగలవు… అని గత తెలంగాణ ప్రభుత్వం నిరూపించి చూపింది.
కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఉద్యోగాలకు కల్పించడం కంటే సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచుతూ ప్రజలందరూ ఎప్పటికీ తమపై ఆధారపడేలా చేసుకొని, ఆ డబ్బు కోసం వారు ఆశపడి వైసీపికి విధేయంగా ఉండేలా చేసుకుంది.
తత్ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేక నిరుద్యోగులు పెరిగిపోయారు. వారిలో అనేకమంది సర్టిఫికెట్లు పట్టుకొని హైదరాబాద్, బెంగళూరు వలసలు వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడేకి సిఎం జగన్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ సమస్యపై అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా విచిత్రంగా ఉంది.
“ఏ ప్రభుత్వమూ, పరిశ్రమ కూడా అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. ఈ సమస్యకు పరిష్కారం స్వయం ఉపాధి మాత్రమే. వివిద కుల వృత్తులు చేసుకునే వారు ఉపాధి పొందితే అది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుంది. అందుకే నా ప్రభుత్వం మత్స్యకారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, ఇంకా వివిద కుల వృత్తులు చేసుకునేవారికి సంక్షేమ పధకాల ద్వారా ఆర్ధిక సాయం అందజేసి వారు స్వయం ఉపాది పొందేలా చేశాము,” అని జగన్ చెప్పారు.
ఈ సమాధానం ఆవు కధలా ఉందనిపిస్తే తప్పు కాదు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి ప్రశ్నిస్తే, అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ సంక్షేమ పధకాల గురించి చెప్పి, వాటి ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని జగన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు అవసరం లేదని ముఖ్యమంత్రి చెపుతున్నారని అనుకోవచ్చు. ఓ ముఖ్యమంత్రి మాటలు, ఆలోచనలు ఈవిదంగా ఉంటే, ఇంక రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఎలా వస్తాయి? రావు కనుకనే రాష్ట్రంలో నిరుద్యోగులు హైదరాబాద్, బెంగళూరు వలసలు వెళ్ళిపోతున్నారు.
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ కూడా కుల వృత్తులను ప్రోత్సహిస్తూ అనేక పధకాలు అమలుచేశారు. కానీ అంతమాత్రన్న పరిశ్రమలు, ఐటి కంపెనీలను వద్దనుకోలేదు. ఆయన హయాంలోనే దేశంలోనే అత్యధిక పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెలంగాణకు వచ్చాయి.
అవే తెలంగాణ ఆర్ధిక వ్యవస్థకు మూలధారంగా నిలుస్తున్నాయి. అవే లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వాటిలో ఉద్యోగాలు చేస్తున్నవారి జీవన ప్రమాణాలు పెరిగాయి. ఈ అభివృద్ధి కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, రవాణా, హోటల్‌కి ఇంకా అనేక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి.
కానీ జగన్ ప్రభుత్వం ఆలోచన భిన్నంగా ఉన్నందున ఏపీలో ఇవేవీ జరుగలేదు. జగన్ గొప్పగా చెప్పుకున్నట్లు ప్రజలందరూ స్వయం ఉపాధి పొందగలిగారా?ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలపడిందా?అంటే లేదని అందరికీ తెలుసు.
పైగా జగన్ ఎంచుకున్న ఈ విధానం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. తమ ఈ విధానం వలన రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలిసి ఉన్నప్పటికీ సంక్షేమ పధకాలతో వైసీపికి బలమైన ఓటు బ్యాంక్ సృష్టించుకోవాలనుకుందని స్పష్టం అయ్యింది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వైసీపి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుందన్న మాట! అయినా కూడా ఇదే సరైన నిర్ణయమని సిఎం జగన్ గట్టిగా సమర్ధించుకుంటున్నారు!ఏమనుకోవాలి?




