ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి శనివారం తాడేపల్లి ప్యాలస్ నుంచి వైసీపి ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే సంక్షేమ పధకాల పాట పాడి, ఈ 5 ఏళ్లలో నవరత్నాలు పంచి పెట్టి మళ్ళీ హీరోగా ప్రజల మద్యకు వస్తున్నానని తనను తాను పొగుడుకున్నారు.
కొత్త మ్యానిఫెస్టోలో కొత్తగా చెప్పేదేమీ ఉండదు కనుక కాసేపు దానిని పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి నుదుటన బ్యాండెయిడ్ లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నిజానికి గులక రాయి దెబ్బకి చిన్న గాయమే అయినందున మర్నాడే బ్యాండెయిడ్ తీసేసేవారే కానీ దానిని హత్యా ప్రయత్నంగా హైలైట్ చేసినందున అది నిజమని నిరూపించేందుకు ఇన్నిరోజులు బ్యాండెయిడ్ అంటించుకుని తిరిగారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.
‘గులక రాయితో తగిలిన దెబ్బ, నొప్పి కంటే ‘ఇది కోడికత్తి 2.0 వెర్షన్” అంటూ టిడిపి నేతలు ఎద్దేవా చేయడమే ఎక్కువ బాధ కలిగించి ఉండవచ్చు. ఒకవేళ ‘గులక రాయితో హత్యాయత్నం’ అనే డ్రామాతో వైసీపికి రాజకీయ మైలేజ్ వస్తున్నట్లయితే నేటికీ వైసీపి నేతలు వారి మీడియా దానినే హైలైట్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. వారి ఆత్మసాక్షి కూడా ‘గులకరాయితో కొత్త కధలు’ వండి వడ్డించడం మానేసింది.
ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుండటం వలన కావచ్చు లేదా ‘బ్యాండెయిడ్‌ని అన్ని రోజులు అంటించుకొని తిరిగితే గాయం మానకపోగా చీము పడితే సెప్టిక్ అవుతుందని’ వైద్యురాలైన సునీతా రెడ్డి చేసిన సూచన వల్లనో తెలీదు కానీ జగన్ నుదుటన బ్యాండెయిడ్ తీసేశారు. అంటే ఆయన కూడా ‘గులకరాయితో హత్యా ప్రయత్నం’ డ్రామా బెడిసికొట్టిందని అంగీకరిస్తున్నట్లే భావించవచ్చు.
అయితే ‘హత్యా యత్నం’ గురించి చెప్పుకోకపోయిన, పోలింగ్ రోజు వరకు జగన్ తప్పకుండా బ్యాండెయిడ్ ఉంచుకొని ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వారి అంచనాలను కూడా తారుమారు చేస్తూ జగన్ బ్యాండెయిడ్ తీసేసి మీడియా ముందుకు వచ్చేశారు!
జగన్ బ్యాండెయిడ్ తీసేయడంతో ఇప్పుడు ప్రతిపక్షాలు “ముఖ్యమంత్రికి కుట్లు పడ్డాయన్నారుగా అవేవి కనిపించడం లేదేమిటి? అంటే అది కూడా అబద్దామేనా?” అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నాయి. ఈ ముగింపు చూస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన్నట్లు అనిపిస్తోంది.




