
పార్లమెంట్ శీతాకాల సమావేశాలతో దేశ రాజకీయాలు వేడేక్కనున్న ఈ తరుణంలో ఏపీ ప్రజాగళం వినిపించడానికి కూటమి ఎంపీ లతో పాటుగా వైసీపీ ఎంపీలు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆ దిశగా దిశా నిర్దేశం చేసారు.
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
ఇక వైసీపీ పార్టీ ఎంపీలకు గాను ఆ పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, ఆ పార్టీ నెంబర్ 2 అభ్యర్థి విజయసాయి రెడ్డి రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించడం, అలాగే ఆ పార్టీ ముఖ్య నేతల పై అవినీతి కేసులు, అక్రమాల విచారణలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎంపీలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చట్ట సభలలో ప్రస్తావించలేని వారు ఇప్పుడు పార్టీ ఘోర ఓటమిని మూటకట్టుకున్న ఈ తరుణంలో రాష్ట్రం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పోరాటం చేసే సాహసం చేస్తుందా.? అంటే ఆ పార్టీ క్యాడర్ కూడా దానికి నో అనే సమాధానమే ఇస్తారు.
Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?
అయితే రాష్ట్రంలో తన ఉనికి కాపుడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక అస్త్రం రాష్ట్రానికి రాని ప్రత్యేక హోదా మాత్రమే కావడంతో ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పాత్రలో ఉన్న వైస్ షర్మిల ఇటు కూటమి పార్టీల ఎంపీ లతో పాటుగా అటు వైసీపీ ఎంపీ లను కూడా ప్రత్యేక హోదా అంశం మీద బీజేపీ పై ఒత్తిడి చెయ్యాలంటూ అదే పాతరాగం ఆలపిస్తున్నారు.
తన అన్న జగన్ బీజేపీ కి దత్త పుత్రుడు అంటూ సంబోధిస్తున్న షర్మిల బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఒక్క నిర్ణయం కూడా తీసుకులేరంటూనే బీజేపీ పెద్దలతో జగన్ నడుపుతున్న తెరవెనుక రాజకీయాలను ప్రస్తావిస్తున్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ ప్రభుత్వ అండ ప్రాణవాయువు వంటిదని కాబట్టి టీడీపీ, జనసేనలు బీజేపీ మెడలువంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలంటు హోదా రాజకీయం మొదలుపెట్టారు షర్మిల.
Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!
జగన్ అన్నకు మాత్రం ఇవేమి పట్టనట్టు లండన్ వీధులలో విహార యాత్రలు చేస్తుంటే చెల్లి షర్మిల మాత్రం హోదా పోరాటాలతో రాజకీయం నెట్టుకొస్తున్నారు. ఇక రాష్ట్ర నాయకుడైన బాబు మాత్రం ఈసారి హోదా ట్రాప్ లో చిక్కుకోకుండా రాష్ట్రానికి, రాజధాని నిర్మాణానికి, పోలవరం పనులకు అవసరమైన నిధులను కేంద్రం నుండి రాబట్టేందుకు కూటమి ఎంపీలను సిద్ధం చేస్తున్నారు.