దిగిపోయే ముందు విజన్ విశాఖ ఏంటి… బొంద!

Vision-Visakha

ఐదేళ్ళ జగన్‌ పాలన మరో 45 రోజులలో ముగియబోతోందని ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ కూడా తేల్చి చెప్పేశారు. వైసీపిలో వలసలు చూసినా అది అర్దమవుతుంది. అయినా వైసీపిలు ఇంకా 175/25 పాట పాడుకుంటామంటే అది వారిష్టం. ఎవరికీ అభ్యంతరం లేదు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అని గట్టిగా వాదించిన జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పుడు దిగిపోయే ముందు సంక్షేమ పధకాలు, అభివృద్ధి రెండూ వేర్వేరని ప్రజలకు చెప్పబోతున్నారు. దాని కోసమే రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో ‘వైజాగ్‌ విజన్‌-ఫ్యూచర్‌ విశాఖ’ పేరుతో మంగళ, బుధవారం సదస్సు నిర్వహించబోతోంది.

ADVERTISEMENT

ఈ సదస్సులో సిఎం జగన్మోహన్‌ రెడ్డి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులకు రాష్ట్రాభివృద్ధి, విశాఖలో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాల వివరించి, విశాఖను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో తోడ్పడాలని కోరబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలిచ్చిన ‘ఒకే ఒక్క ఛాన్స్’ని జగన్‌ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా, ప్రజలిచ్చిన పుణ్యకాలం అంతా వృధా చేసేసుకున్నాక, ఇప్పుడు మేల్కొని ఆంధ్రప్రదేశ్‌ అభివృధ్ది, విజన్ విశాఖ అంటూ హడావుడి చేస్తూ ఇంకా నమ్మించాలనుకున్నా ప్రజలు ఆశ్చర్యం పోరు. ఎందుకంటే ఇదే వైసీపి నైజం అని వారికి తెలుసు కనుక. కానీ జగన్‌ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను కూడా మభ్యపెట్టగలమని అనుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

సరిగ్గా ఏడాది క్రితం ఇదే మార్చి నెలలో…. ఇదే విశాఖ నగరంలో ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ‘త్వరలోనే నేను విశాఖ షిఫ్ట్ అవుతున్నాను. ఇక విశాఖ రాజధానిగా ఇక్కడి నుంచే పాలన సాగుతుందని’ జగన్‌ నమ్మబలికారు.

ఈసారి సదస్సులో మళ్ళీ వారు అదే విషయం ప్రశ్నిస్తే చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. బహుశః వారిని మళ్ళీ మభ్య పెట్టేందుకే వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఋషికొండ ప్యాలస్‌కి హడావుడిగా మంత్రుల చేత ‘రహస్య గృహప్రవేశం చేయించారేమో?నేడు సదస్సులో అదే చూపిస్తారేమో?

వందల కోట్లు ఖర్చు చేసి దానిని ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి పనులను సిఎం సమీక్షించడానికే కట్టామని మంత్రులే చెప్పుకొంటున్నారు. మరి దానిలోనే ఈ సదస్సు నిర్వహించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసి దాని పక్కనే ఉన్న రాడిసన్ హోటల్లో ఎందుకు నిర్వహిస్తున్నట్లు?

మంత్రి రోజా నెలకు 3-4సార్లు తిరుమల వీఐపి బ్రేక్ దర్శనం చేసుకోవడం, 2-3 సార్లు తాడేపల్లికి వేంచేసిన జగనన్నని దర్శించుకోవడమే పర్యాటక శాఖ మంత్రి బాధ్యత అను అనుకుంటారు. కానీ ఈ సదస్సులో ఆమె శాఖకు చెందిన ‘పర్యాటకం’ అనే మాటలు వినబడతాయి కనుక బహుశః ఆమె కూడా ఈ సదస్సుకి రాక తప్పదు.

గత ఏడాది జరిగిన రెండు రోజుల సదస్సులో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో ఏర్పాటు కాబోయే పరిశ్రమలతో రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయని మన గుడ్డు మంత్రి గొప్పగా చెప్పారు. మరి ఆ ఒప్పందాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సంగతి ఏమైందో ఎవరికీ తెలీదు. మళ్ళీ ఏడాది తిరిగేసరికి అభివృద్ధి కోసం సదస్సు నిర్వహిస్తోంది.

ఈ 58 నెలల్లో విశాఖలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్‌ కూడా నిర్మించని జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు దిగిపోయే ముందు విశాఖని అభివృద్ధి చేస్తాం అంటోంది. ఈ ముక్క చెప్పడానికి కోట్లు ఖర్చు చేస్తోంది కూడా. కానీ మరో 45 రోజులు ఏం చెప్పినా నమ్మాల్సిందే తప్పదు.

ADVERTISEMENT
Latest Stories