సంక్షేమ మార్గంలో స్టిక్కర్స్ చూసుకొంటూ భవిష్యత్‌ వెతుక్కొంటూ….

YS-Jagan-Welfareఏ ప్రభుత్వామైనా ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తే ఎన్నికల సమయంలో ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వం కళ్ళ ముందే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ 9 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేశామో, ఎన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామో ప్రజలకు చెప్పుకొని, మా పాలన నచ్చితేనే ఓట్లు వేయమని అడుగుతున్నారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కూడా కళ్లెదుటే కనిపిస్తోంది కనుక బిఆర్ఎస్‌ను కాదనలేరు. అభివృద్ధి, సంక్షేమ పధకాలను సమానంగా చేస్తూన్నప్పటికీ 119 సీట్లు మేమే గెలుచుకోగలమని కేసీఆర్‌ చెప్పడం లేదు. ఈసారి 95-100 సీట్లు గెలుచుకోగలమని చెపుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఏపీలో ఈ నాలుగేళ్ళ వైసీపీ పాలనలో సంక్షేమ పధకాల గోల తప్పితే ఒక్క అభివృద్ధి పని కూడా జరుగలేదు. జరిగి ఉంటే, వైసీపీ నేతలు ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. వారు కూడా తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపనుల గురించే చెప్పుకొనేవారు. అప్పుడు 175 సీట్లు తమకే ఇవ్వాలని అడిగినా అర్దం చేసుకోవచ్చు.

కానీ సంక్షేమ పధకాల గురించి మాత్రమే చెప్పుకొంటున్నారు. అదీ… వైసీపీలో అందరూ కాదు. సిఎం జగన్‌ ఒక్కరే గట్టిగా చెప్పుకొంటున్నారు! మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గడప గడపకి వెళ్ళి చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే టికెట్స్ ఇవ్వనని హెచ్చరిస్తున్నారు. ప్రతీ ఇంటికి మేలు చేశాము కనుక మళ్ళీ తమకే ఓట్లు వేయాలని గట్టిగా అడగమని ఒత్తిడి చేస్తున్నారు.

అయితే జగన్‌ నమ్ముతున్న ఈ సంక్షేమ సిద్దాంతాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా నమ్మడం లేదనే చెప్పాలి. గడప గడపకి కార్యక్రమంలో వారు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలతో ప్రజలు తమ ప్రభుత్వం, పాలన, సంక్షేమ పధకాల గురించి ఏమనుకొంటున్నారో వారికి బాగానే అర్దమైంది. కనుకనే సిఎం జగన్‌ ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు.

అయితే వారు ఎందుకు దానిలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదో తెలుసుకొని ఉంటే ఎన్నికలలో గెలిచేందుకు తను ఎంచుకొన్న ‘సంక్షేమ విధానం’ తప్పని సిఎం జగన్‌ గ్రహించి ఉండేవారు. కానీ రాజధాని విషయంలోనే వెనక్కు తగ్గని జగన్‌, సంక్షేమ పధకాల విషయంలో వెనక్కు తగ్గుతారని ఆశించేలేరు. కనుకనే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మౌనంగా ఉండిపోతున్నారు.

వారి ధీమాకు మరో కారణం కూడా ఉంది. తమ ప్రభుత్వ పాలన ఏవిదంగా ఉన్నప్పటికీ, ప్రజలు ఏమనుకొన్నప్పటికీ మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం జగనన్నకు చాలా ముఖ్యం కనుక ఆయనే ఏదోవిదంగా తామందరినీ గెలిపించుకొంటారనే ధీమా కూడా ఉంది. ఇది వాస్తవం కూడా.

అయితే తాను ఎంచుకొన్న సంక్షేమ మార్గంలో మళ్ళీ అధికారమనే గమ్యం చేరుకోలేమని బహుశః జగన్‌కు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే, పక్కనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఏపీలో ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. పైగా తమ పాలనలో సంక్షేమ పధకాలను మినహాయిస్తే ఎటు చూసినా సమస్యలు, కష్టాలు, అవినీతి, అరాచకాలే కనిపిస్తున్నాయని బహుశః జగన్‌కు కూడా తెలిసే ఉంటుంది. నాలుగేళ్ళుగా తన ప్రభుత్వానికి అండగా నిలుస్తూ అడిగినంతా అప్పులు ఇప్పిస్తున్న మోడీ ప్రభుత్వం కూడా ఏపీలో అవినీతి, అరాచక ప్రభుత్వం ఉందంటూ యుద్ధం ప్రకటించడమే ఇందుకు తాజా నిదర్శనం.

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు వ్యాపిస్తున్నట్లు, వైసీపీకి రాష్ట్రంలో వ్యతిరేక వాతావరణం ఏర్పడిందని బహుశః జగన్‌ కూడా గుర్తించే ఉంటారు. కానీ ప్రజలు ఇచ్చిన ‘పుణ్యకాలం’ కాస్త పూర్తయిపోతోంది. కనుక ఇప్పుడు మరో కొత్త మార్గంలో ప్రయాణించినా గమ్యం చేరుకోలేరు.

కనుక తప్పో ఒప్పో ఎంచుకొన్న సంక్షేమ మార్గంలోనే దారి పొడవునా అంటించిన స్టికర్స్ చూసుకొంటూ, తన భవిష్యత్‌ వెతుక్కొంటూ ముందుకు సాగిపోవలసిందే. తప్పదు! వేరే దారిలేదు!

ADVERTISEMENT
Latest Stories