అన్నా చెల్లెళ్ళ బంధం లోకంలో ఎక్కడైనా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం విభిన్నంగా ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆమె అన్న కేటీఆర్ వారితో వాగ్వాదం చేస్తూ చెల్లిని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు గట్టిగా ప్రయత్నించారు.
నా చెల్లిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చి ఇప్పుడు హటాత్తుగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని గట్టిగా నిలదీశారు. ఈడీ సుప్రీంకోర్టుకి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ కాపీని తీసుకువచ్చి వారికి చూపిస్తూ, నా చెల్లిని అరెస్ట్ చేస్తే మీపై కోర్టు ధిక్కారం కేసు వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
వారి బావ హరీష్ రావు కూడా కల్వకుంట్ల కవిత అరెస్టుని తీవ్రంగా ఖండించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
నేడు కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు మరికొందరు ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్ళి జాతీయ పార్టీ నేతలతో మాట్లాడి ఆమెకు సంఘీభావం తెలియజేసేందుకు ప్రయత్నించబోతున్నారు.
ఇది తెలంగాణలో ఓ అన్నా చెల్లి మమతానురాగాల కధ కాగా, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లి షర్మిల, మరో చెల్లి సునీతా రెడ్డి కధ ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆ ఇద్దరు చెల్లెమ్మలు నిన్న కడపలో వివేకా సంస్మరణ సభలో మాట్లాడుతూ, “వివేకా హంతకులకు శిక్ష పడేలా చేయవా అన్నా?అని మేము అడిగితే, ఆ హంతకులనే మా అన్న వెనకేసుకువస్తున్నారు. సొంత చెల్లెళ్ళ మీదకే తన కాలాకేయ సైన్యాన్ని ఉసిగొల్పుతున్నాడు. మా అన్న ఇలాంటివాడని మేము ఎన్నడూ ఊహించలేకపోయాము.
హంతకులు ఎక్కడో లేరు మన చుట్టూనే ఉన్నారని తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. హంతకులను కాపాడుతూ చెల్లెళ్ళ మీద ఎదురుదాడి చేయిస్తున్న మా అన్న జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ పార్టీలో నేతలందరూ ధైర్యంగా బయటకు వచ్చి మాతో చేతులు కలిపి మా అన్నపై మేము చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి అన్నారు.
అక్కడ తెలంగాణలో చెల్లి కోసం అన్న కేటీఆర్ ఢిల్లీ వరకు వెళ్ళి పోరాడేందుకు సిద్దపడుతుంటే, ఇక్కడ ‘ఏపీ అన్నయ్య’ తన చెల్లెమ్మలు పులివెందులలో వివేకా సంస్మరణ సభ కూడా నిర్వహించుకోనీయకుండా అడ్డుకున్నారు.
కూతురు కోసం కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కానీ కూతవేటు దూరంలో కడపలో మరిది (వివేకానంద రెడ్డి) సంస్మరణ సభకు విజయమ్మ వెళ్ళలేదు. బహుశః వెళ్ళనీయలేదేమో?
ఇరుగు పొరుగు తెలుగు రాష్ట్రాలలోనే అన్నా చెల్లెళ్ళు, కుటుంబ బంధాలు, అనుబంధాలలో ఇంత తేడా కనిపిస్తుండటం ఆశ్చర్యంగానే ఉంది కదా?




