మంగళవారం తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ పీఏసీ సభ్యులతో జగన్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, అరాచకాలు, అక్రమ కేసులు, ముఖ్య నేతల అరెస్టులు, మహిళ నేతలను కించపరిచడం, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తుండటం, రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, క్వార్జ్, సిలికాన్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియాల గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.
సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి జగన్ చెపుతున్న ఇవన్నీ నాడు తన హయంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలను గుర్తుచేసుకొని చెపుతున్నట్లే ఉండటం విశేషం.
తన పార్టీలో ఉన్నవారందరూ కడిగిన ఆణిముత్యాలేనని జగన్ సర్టిఫై చేశారు. కనుక వారిపై కేసులు నమోదు చేయడమంటే వేధించడమే అని జగన్ తేల్చి చెప్పారు.
ఈ సమావేశంలోనే ‘మనం ఏ విత్తనం వేస్తే అదే మొక్క మొలుస్తుందని, అవే ఫలాలు వస్తాయని’ అనే పాత విషయాన్ని జగన్ మళ్ళీ కనిపెట్టి చెప్పారు. కనుక ఈ కేసులు, వేధింపులు కూడా నాడు తాను వేసిన విత్తనాలకు మొలిచిన మొక్కలే… అనుభవిస్తున్న ఫలాలే అని జగన్ చెప్పుకున్నట్లే ఉంది.
ఓ పక్క కూటమి ప్రభుత్వం వరుస పెట్టి ‘సూపర్ సిక్స్’లోని ఎన్నికల హామీలను ఒకటొకటిగా అమలు చేస్తున్నా, అమలు చేయడం లేదని జగన్ పాడుతుండటం అలవాటులో పొరపాటుగా సరిపెట్టుకోక తప్పదు.
అధికారంలో ఉన్నప్పుడు ‘కరోనా కారణంగా’ పార్టీ కార్యకర్తలని పట్టించుకోలేకపోయానని జగన్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ముఖ్యమంత్రి కాగానే లక్షల మందితో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, వారికి ప్రజాధనంతో జీతాలు చెల్లిస్తూ, పార్టీ సేవలకు ఉపయోగించుకున్నప్పుడు, వారికి ఏటా అవార్డులు, బోనసులు కూడా ఇచ్చినప్పుడు జగన్ ప్రభుత్వానికి ఏ కరోనా అడ్డు కాలేదు.
ఎన్నికలలో వైసీపీ ఓడిపోగానే వాలంటీర్లను రోడ్డున పడేసి మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలకి ప్రాధాన్యం ఇస్తానని జగన్ ఎందుకంటున్నారంటే కార్యకర్తలకు నెలనెలా వాలంటీర్లలా జీతాలు ఇవ్వక్కరలేదు కనుకనే. అందరూ వచ్చి ఫ్రీగా పనిచేస్తారు కనుకనే! కాదంటే వాలంటీర్లకు నెలనెలా జీతాలు ఇచ్చినట్లు కార్యకర్తలకు కూడా జీతాలు ఇవ్వగలరా? అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలని పట్టించుకోనప్పుడు, ఇప్పుడు వారు మాత్రం తన కోసం ఎందుకు ఫ్రీగా పనిచేయాలి?అని జగన్ ఆలోచించి ఉంటే బాగుండేది.
టెక్నాలజీ విషయంలో జగన్‌కు ఇంతకాలం తెలిసింది ‘సోషల్ మీడియా’ ఒక్కటే. తొలిసారిగా మరో అడుగు ముందుకు వేసి ‘క్యూఆర్ కోడ్’ వరకు నేర్చుకొని ‘రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో’ అంటూ ఏదో ప్రయోగం చేయబోయి నవ్వులపాలయ్యారు.
ఇప్పుడు సాంకేతికంగా మరో అడుగు వేస్తూ ‘మొబైల్ యాప్’ అంటున్నారు జగన్. త్వరలో ‘మొబైల్ యాప్’ లాంచ్ చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్న దానిలో పత్రాలు, ఫోటోలు, వీడియోలు వగైరా అప్‌లోడ్ చేస్తే వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టెక్నాలజీ పరంగా జగన్ ఇంత వేగంగా దూసుకుపోయి మొబైల్ యాప్ కనిపెట్టబోతున్నందుకు ఆయనని తప్పక అభినందించాల్సిందే.
ఇక ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలందరూ ముఖ్యంగా మాజీ మంత్రి రోజా జగన్ భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం జగన్‌కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నప్పటికీ వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు కనుక జగన్ తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రావడం ఇంకా తగ్గిస్తే మంచిదేమో?





