రాని ప్రత్యేక హోదా…రాలేని వైస్సార్…స్క్రిప్ట్ మార్చమ్మా…చెల్లమ్మా..!

YS Sharmila

వైస్సార్ టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ స్థాపించి పుట్టింటి నుండి అత్తంటికి వెళ్లిన వైస్ షర్మిల అక్కడ ప్రజల మన్ననలు పొందలేక తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి పుట్టింటికి వచ్చి అన్న మీద రాజకీయ యుద్ధం మొదలుపెట్టారు.

అయితే ఈ యుద్ధంలో భాగంగా అధికార – ప్రతిపక్షాల మీద షర్మిల చేస్తున్న ఎన్నికల ప్రచార శైలి మొదట్లో అందరిని ఆకట్టుకున్నప్పటికీ పోను పోను అదే స్క్రిప్టుతో ముందుకెళ్లడంతో సభలకు వస్తున్న పార్టీ శ్రేణులతో పాటు సభలను వీక్షిస్తున్న వీక్షకులకు కూడా అసహనానికి గురవుతున్నారు.

ADVERTISEMENT

ప్రత్యర్థులను విమర్శించడానికి కూడా అన్న మాదిరి నిముషం నిముషానికి స్క్రిప్ట్ పేపర్ చూడాల్సిన అవసరం లేకుండా మాట్లాడగలిగే షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగుపెట్టింది మొదలు ఒకటే తరహా ప్రచారంతో ముందుకెళ్తున్నారు. మైకు పట్టుకుంటే చాలు ఏపీ కి రాని ప్రత్యేక హోదా గురించి…., ఎప్పటికి తిరిగి రాని వైస్సార్ గురించి చెప్పి చెప్పి ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు.

గత ఎన్నికలలో ఈ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని జగన్ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రత్యేక హోదా నావల్ల కాదు అంటు చేతులెత్తేశారు. ఆతరువాత ఆ హోదా మాట అటుంచితే ఇస్తానన్న ప్యాకేజీ మాట ఎక్కడికి పోయిందో కూడా ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. ప్రత్యేక హోదా అన్నది ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ నాయకుల దగ్గర ఉన్న ఒక దివ్య ఔషధం అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకానికి ఒక క్లారిటీ వచ్చింది.

రాజకీయ పార్టీలకు ఓటు అడగడానికి….రాజకీయ నాయకుల ప్రచారానికి తప్ప ఈ ప్రత్యేకహోదా హామీ రాష్ట్రానికి అందని ద్రాక్షే అనేది ప్రజలకు అర్ధమయినప్పటికీ షర్మిల అదే అంశాన్ని పట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం ఆమె అవివేకమే అవుతుంది. అలాగే 2009 లో అనుకోని విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైస్సార్ పేరును మాటకు ముందుకొకసారి మాట తరువాత ఒకసారి మాట్లాడి వైస్సార్ అభిమానులకు కూడా విసుగు తెప్పిస్తున్నారు వైస్సార్ బిడ్డ షర్మిల.

తండ్రి రాజకీయ వారసత్వంతో అధికారంలోకి రావడం తప్పు కాదు. అలాగే తన రాజకీయ ఎదుగుదలకు తండ్రి పేరుని వాడుకోవడం లో అభ్యంతరం ఉండదు. కానీ మాటకొకసారి వైస్సార్ పేరు వాడుతూ ఎన్నికల ప్రచారాన్ని, ప్రత్యర్థుల మీద విమర్శలను చేయాలనుకువడం మాత్రం షర్మిల రాజకీయ తప్పిదమే అవుతుంది. మీ రాజశేఖర్ బిడ్డ అంటు ప్రసంగాన్ని మొదలు పెడుతున్న షర్మిల ఇదేనా రాజశేఖర్ రెడ్డి పాలన అంటే.., ఇదేనా జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యం.

రాజశేఖర్ రెడ్డి పాలనకు – జగన్ రెడ్డి పాలనకు నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది…రాజశేఖర్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి.. జగన్ రెడ్డి ప్యాలస్ ముఖ్యమంత్రి….అంటు ఇలా మాటమాటకు రాలేని రాజశేఖర్ రెడ్డి పేరు చెపుతూ సభలకు వస్తున్న వైస్సార్ అభిమానులకు కూడా విసుగు తెప్పిస్తున్నారు షర్మిల. గడిచిన రెండు నెలల నుంచి ఇదే అరిగిపోయిన ఎన్నికల ప్రచారంతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు షర్మిల.

నిజంగా ఆమె జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయాలి అనుకుంటే ప్రజలకు చెప్పడానికి, వైస్సార్ పార్టీ ని ఇరుకునపెట్టడానికి చాల అంశాలే ఆమె అంబులపొదలో ఉంటాయి. అటువంటి వాటిని బయటకు తీసి ఓటర్ల దృష్టిని తన వైపు తిప్పుకోవచ్చు. ఎలా అయితే షర్మిలను టార్గెట్ చేయడానికి జగన్ ఏకంగా ఎవరికీ తెలియని ఆమె వ్యక్తిగత జీవితాన్ని సైతం బయటపెట్టారో.

ఇన్నాళ్లుగా వైస్ షర్మిలగా ఉన్న ఆమెను మురుసుపల్లి షర్మిలాగా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది వైస్సార్ పార్టీ, ఆపార్టీ మీడియా అయినా సాక్షినే. తన పై రాజకీయ దాడికివస్తే అది చెల్లైనా, తల్లైన ఒక్కటే అన్నట్టుగా జగన్ వ్యవాహరిస్తుంటే షర్మిల మాత్రం అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు మాదిరి అదే ప్రత్యేక హోదా… అదే వైస్సార్ ను ప్రచారం చేయడం చూస్తుంటే…ఇకనైన రాని ‘ప్రత్యేక హోదా…రాలేని వైస్సార్ కాకుండా’ కాస్త ‘స్క్రిప్ట్ మార్చమ్మా చెల్లెమ్మా’..! అంటు సలహాలిస్తున్నారు వైస్సార్ అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories