ఏపీలో పిఠాపురంలో ఉన్న ‘దత్తాత్రేయుడు’ ఎంత ఫేమసో ‘దత్తపుత్రుడు’ అనే పదం కూడా అంతే పాపులర్ అయ్యింది. దీని పూర్తి క్రెడిట్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని చెప్పాలి. తన ప్రత్యర్థి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించడానికి పవన్ అనే పేరు కూడా వాడకుండా ఒక దత్త పుత్రుడు, ఒక ప్యాకేజీ స్టార్ అంటూ పదేపదే సంబోధిస్తారు.
ఇప్పుడు ఇదే పదంతో వైస్ షర్మిల తన అన్న జగన్ ను టార్గెట్ చేసారు. నిన్న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల తన పై జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ వేస్తూ జగన్ ను మోడీ వారసుడు అంటూ సంబోధించారు. తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, తన వారిని కేసుల నుండి కాపాడుకోవడం కోసం, తన పదవులను నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిన జగన్ ‘మోడీకి దత్తపుత్రుడే’ అంటూ వైకాపా నాయకులతో పాటు జగన్ కు కూడా ఊహించని షాక్ ఇచ్చారు.
షర్మిల వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దత్తపుత్రుడు…దత్తపుత్రుడు అంటూ కలవరించే వ్యక్తే చివరికి దత్తపుత్రుడుగా మారిపోయాడు. ఇది షర్మిల స్క్రిప్ట్ ఆ లేక ఆ దేవుని స్క్రిప్ట్ ఆ అంటూ జగన్ పై సెటైర్లు వేస్తున్నారు పవన్ అభిమానులు. గతంలో జగన్ కు కౌంటరుగా ‘సిబిఐ దత్తపుత్రుడు’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు జనసైనికులు.
దీనితో ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రాలేదు కానీ రెండవ దత్తపుత్రుడు వచ్చాడు అంటూ సామజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతుంది. షర్మిల వేసిన ఈ ఒక్క కౌంటర్ తో అటు వైసీపీ లో నైరాశ్యం ఇటు జనసైనికులలో ఉత్సాహం రెండింతలయ్యిందనే చెప్పాలి. షర్మిలతో రాజకీయ మాములుగా ఉండదు మరి అంటున్నారు కాంగ్రెస్ నేతలు.




