అందరి జీవితాలు సరే… మీ జీవితం మారుతుందా… షర్మిలమ్మా?

YS-Sharmila-Vote

సాక్షాత్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చెల్లెలు ఆమె. కానీ ఆమెకు వైసీపిలోనే కాదు… ఏపీలో కూడా చోటు లేకుండా పోయింది. దాంతో ఆమె తెలంగాణలో తన అదృష్టం పరీక్షించుకోవాలనుకొన్నారు. రాజన్న రాజ్యాన్ని స్థాపించి దానిని ఏలాలనుకొన్నారు. కానీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఓ విఫల రాజకీయ ప్రయోగంగా ముగిసింది. క్లుప్తంగా ఇదీ వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం.

కనీసం ఆమె తాను ఎంచుకొన్న బాటలోనే ముందుకు సాగి ఉండి ఉంటే, నేడు చాలా బిజీగా ఉండేవారు. కానీ ఆమె కాంగ్రెస్‌ను నమ్ముకొని పార్టీ నేతలకు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్దపడటంతో వారు ఆమెనే పార్టీలో నుంచి బహిష్కరించి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఆమె యుద్ధభూమిలో ఆయుధాలు, సైన్యం కోల్పోయిన సైన్యాధ్యక్షురాలిగా మిగిలిపోయారు.

ADVERTISEMENT

ఈరోజు పోలింగ్‌ మొదలైన కొద్ది సేపటికే వైఎస్ షర్మిల బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 12లో తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “మన అందరి జీవితాలను మార్చే శక్తి ఈ ఓటుకే ఉంది. కనుక అందరూ వచ్చి ఓట్లు వేసి మీ జీవితాలను మార్చుకోవాలని కోరుతున్నాను. ప్లీజ్ ఓట్,” అని విజ్ఞప్తి చేశారు.

‘అందరి జీవితాలు సరే… ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం ఏవిదంగా ఉండబోతోంది?’ అని సందేహం కలగడం సహజం. కాంగ్రెస్ పార్టీ ఆడిన గేమ్ వలననే ఆమె రాజకీయ ఏకాకి లేదా రాజకీయ నిరుద్యోగిగా మిగిలిపోయారు కనుక ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆమెకు ఏమైనా మేలు చేయవచ్చు.

ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోయినా ముందే హామీ ఇచ్చిన్నట్లుగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించవచ్చు. కనుక కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా ఆమె మాత్రం ఒడ్డున పడతారనే భావించవచ్చు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలనుకొంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారవచ్చు. కనుక ఆమె ఈ ఓటుతో ఆమె రాజకీయ జీవితం ఏవిదంగా మారుతుందో డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడ్డాక తెలియవచ్చు.

ADVERTISEMENT
Latest Stories