తెలంగాణ ఎన్నికల పోటీ నుండి స్వచ్ఛందంగా తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు తెలిపిన వైస్ షర్మిల తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితుల పై తన సామజిక మాధ్యమంలో స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్ ను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముంది అంటున్న కేటీఆర్ గారు..అసలు మీకు జనం ఓటేయాల్సిన అవసరం ఏముంది? ఓట్లేసి గెలిపించిన ప్రజలను కలవకుండా, వారి సమస్యలను వినకుండా ఫామ్ హౌస్ లో భోగాలు అనుభవించడానికా? మీకు పదవులు కావాల్సింది?గతంలో వైస్సార్ రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టి ప్రజా ప్రభుత్వానికి చిరునామాగా నిలిచారు.
కానీ ప్రజల ఓట్లతో గద్దెనెక్కి ప్రజలను దరిచేరనివ్వకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమవుతున్నారు. అధికార మత్తులో మీ పార్టీ నేతలకు ప్రజా సమస్యలు కనిపిస్తాలే., అందుకే మీ ప్రభుత్వాన్ని నియంత ప్రభుత్వం అని మీ పాలన నియంతల పాలనను తలపిస్తుందంటూ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన విమర్శలు ఇప్పుడు ఆంధ్రాలో నిప్పు రాజేశాయి.
ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత అయితే తాడేపల్లి పాలస్ వదిలి ప్రజాక్షేత్రంలోకి రాని మీ అన్న జగన్ ను ఏపీ ప్రజలు ఏమనాలో కూడా కాస్త చెప్పు చెల్లమ్మా.!అంటూ అదే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల పరంపర మొదలుపెట్టారు నెటిజన్లు. పరదాలు కట్టుకుని, పచ్చని చెట్లను నరికించి, స్థానిక వ్యాపా షాపులను మూయించి ప్రజల మధ్యకు వచ్చే ముఖ్యమంత్రి కూడా బహుశా ఈ దేశంలో జగన్ ఒక్కడే అయింటాడు షర్మిలక్కా అంటూ జగన్ పరదాల గుట్టు విప్పారు.
రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరిగినా,దేవుడి రథాలు తగలబడి పోయినా, అధికార పార్టీ నేతలే సామాన్యుల మీద దాడులకు పాల్పడినా, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేసినా కనీసం ఒక్క దాని పై కూడా స్పందించడానికి ప్రజల మధ్యకు రాని జగన్ కూడా నియంతేగా? గడిచిన నాలుగున్నరేళ్లుగా రాజధానికి భూములిచ్చి రోడ్డు మీదే తమ జీవితాన్ని గడుపుతున్న అమరావతి రైతులకు భరోసా ఇవ్వడానికి గాని,అలాగే “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” నినాదంతో ఉద్యమాలు చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నేనున్నాను అనే నమ్మకాన్ని ఇవ్వడానికి కానీ తాడేపల్లి పాలస్ గడప దాటని మీ జగనన్న కూడా దొరేగా?
అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల గడిచినా ఒక్కటంటే ఒక్క ప్రస్ మీట్ కూడా పెట్టని, పెట్టలేని జగన్ ను ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి ,ఈ నియంత పాలనకు నాకు సంబంధం లేదు అని చెపుతున్న మీరు కూడా ఆంధ్రా ద్రోహులే అంటూ వైస్ జగన్ ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని షర్మిల మీద చూపిస్తున్నారు ఏపీ ప్రజలు.




