జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఆయన అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కొడుకు రాజారెడ్డి పెళ్ళికి ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “మా నాన్నగారు తన ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళకు కూడా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. ఆయన వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మనుమడు రాజారెడ్డి పెళ్ళికి నేను ఆయనను ఆహ్వానించాను. ఇదేమీ పెద్ద విచిత్రం, విడ్డూరం కాదు.
మాకు రాజకీయాలు ఓ ప్రొఫెషన్. కనుక ఒకరినొకరిని ఎప్పుడో అప్పుడు ఓ మాట అనుకుంటాము. అయితే రాజకీయాలలో ఈ చేదుని తొలగించి ఒక స్నేహపూరితమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశ్యంతోనే నేను నారా లోకేష్‌కు క్రిస్మస్ కేక్ పంపాను. అది ఒక కేక్ మాత్రమే కదా? కనుక దానిని రాజకీయంగా చూడాల్సిన అవసరంలేదు.
నేను నారా లోకేష్‌తో పాటు కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఇంకా చాలామందికి నేను క్రిస్మస్ కేకులు పంపాను. రాజకీయాలలో ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలని నేను కోరుకుంటాను. అయితే ప్రస్తుతం ఎటువంటి వాతావరణం ఉందో మీ అందరికీ తెలుసు.
చంద్రబాబు నాయుడు టిడిపి అధినేత. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కనుక ఆయనతో కానీ, టిడిపితో కానీ నాకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు. భవిష్యత్‌లో కూడా ఉండవు.
నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కనుక పార్టీ అధిష్టానం నాకు ఏ బాధ్యత అప్పగిస్తే అది చేస్తాను. మన రాజకీయాల కోసం ఏ పార్టీని ఎంచుకున్నప్పటికీ ప్రజలకు కట్టుబడి పనిచేయాలని నమ్ముతాను,” అని వైఎస్ షర్మిల అన్నారు.
వైఎస్ షర్మిల చెప్పిన్నట్లు రాజకీయాలలో ఉన్నవారు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు తమ రాజకీయ ప్రత్యర్ధులను ఆహ్వానిస్తుండటం సర్వసాధారణ విషయమే. అయితే మాటలు నేర్చిన చిలకలా ‘ఫ్రెండ్లీ రాజకీయాలు… రాజకీయాలలో స్నేహపూర్వక వాతావరణం’ అంటూ మాట్లాడుతుండటమే విచిత్రం.
ఆమె ఫ్రెండ్లీ రాజకీయాల కారణంగానే ఇదివరకు ఏపీ నుంచి తెలంగాణకు, ఇప్పుడు తెలంగాణ నుంచి మళ్ళీ ఏపీకి గుంటూరు కారం హీరోలా తిరుగవలసి వస్తోంది కదా?
ఏపీకి వస్తే ఆమె అన్నతో కూడా ఇలాగే ఫ్రెండ్లీ రాజకీయాలు చేయగలరా?కనీసం ఆమె అన్న ఆమె చేసే ఇటువంటి ఫ్రెండ్లీ రాజకీయాలను ఆమోదిస్తారా?
ఇంతకాలం ఆమె తెలంగాణ ప్రజల కోసమే తాను రాజకీయ పార్టీ స్థాపించానని చెప్పుకుంటూ తిరిగారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలను వదిలేసి ఏపీకి ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగితే కాంగ్రెస్ అధిష్టానాన్ని సాకుగా చూపుతున్నారు.
తన అన్న రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆయనతో హాయిగా కబుర్లాడి బయటకు వచ్చి టిడిపితో ఎటువంటి సంబందమూ లేదు. భవిష్యత్ ఉండబోదు… అని చెప్పడం ఆమెకే చెల్లునేమో? ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అని అడిగినప్పుడు కూడా ఆమె లేదనే చెప్పారు. ఇప్పుడూ అలాగే చెపుతున్నారని అర్దమవుతూనే ఉంది.
వైఎస్ షర్మిల రాజకీయాలలో రాణించలేనప్పటికీ మాటలు బాగా నేర్చారని చెప్పక తప్పదు. కనుక రేపు ఆమె ఏపీలో అడుగుపెడితే అన్న గురించి ఏం చెపుతారో ఆమె నోటనే అందరూ వినవచ్చు.




