మీరు భారతదేశ పౌరులా? అందుకు రుజువు ఏమిటి? అని ప్రశ్నిస్తే చాలామంది టక్కున ఆధార్ కార్డు తీసి చూపిస్తారు. కానీ అది కేవలం మీ పేరు, ఫోటో, చిరునామాలకు గుర్తింపు కార్డు మాత్రమే. అది మీ పౌరసత్వానికి రుజువు కాదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో స్పష్టం చేసింది.
రేషన్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు, క్రెడిట్ కార్డు వగైరాలు కూడా వేర్వేరు అవసరాల కోసం జారీ చేసినవే తప్ప, మీరు భారతీయ పౌరులని నిరూపించే అధికారిక ధ్రువపత్రాలు కావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత సంస్థలు, శాఖలు స్పష్టం చేశాయి.
అయితే భారతీయ పాస్‌పోర్టు తిరుగులేని నిదర్శనం అని చాలామంది వాదించవచ్చు. కానీ అది కూడా పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాదని, అది కేవలం విదేశీ ప్రయాణాల కోసం జారీ చేసిన అధికారిక పత్రం మాత్రమేనని కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
మరైతే “భారతీయ పౌరుడిని” అని ఏవిధంగా నిరూపించుకోవాలి? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకే ఒక్క పత్రం ద్వారా కాకుండా వివిధ ప్రభుత్వ రికార్డులు, పత్రాలు, పరిస్థితులను పరిశీలించి పౌరసత్వాన్ని నిర్ధారించే విధానం ప్రస్తుతం అమలులో ఉంది.
కానీ అమెరికా, యూరప్ దేశాలలో పాస్‌పోర్టు కలిగి ఉంటే అది తిరుగులేని పౌరసత్వ గుర్తింపుగా పరిగణిస్తారు. కానీ మన దేశంలో అది పౌరసత్వ గుర్తింపు కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఓ అయోమయ పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ప్రత్యేక సవరణ కార్యక్రమాల ద్వారా నకిలీ ఓటర్లను, విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి భారత్‌లో ఓటర్లుగా చలామణి అవుతున్న వారిని గుర్తించే ప్రక్రియ చేపడుతోంది. కనుక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు పౌరసత్వాన్ని ధ్రువీకరించే ప్రత్యేక ధ్రువపత్రం ఏమైనా జారీ చేయబోతోందా? అనే ప్రశ్న వినిపిస్తోంది.




