నదీ జలాల వాటాలు, వాడకం విషయంలో దశాబ్దాలుగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల మధ్య వివాదాలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి రాజకీయ కారణాలతో నదీ జలాల పేరుతో కీచులాటలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ కర్ణాటకలోని హొస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో ఒక అపురూప దృశ్యం కనిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మూడు రాష్ట్రాల జలవనరుల శాఖా మంత్రులు, అధికారులు కలిసి కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
తద్వారా రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసం పరస్పరం సహకరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముగ్గురు ముఖ్యమంత్రులు చాటి చెప్పినట్లయింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి పనిచేయడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని స్పష్టమైన సందేశం ఇచ్చారు.
తుంగభద్ర జలాలలో తెలంగాణ వాటాను కాపాడుకుంటామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ కార్యక్రమానికి హాజరవడం ద్వారా సాటి కాంగ్రెస్ సీఎం డీకే శివకుమార్‌తో దీని గురించి మాట్లాడి ఒప్పించే అవకాశం పొందారు. కానీ ఈ వేదికపై ఏపీ, తెలంగాణ సీఎంలు చేతులు కలపడం, ఇద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకోవడంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ఆయుధం అందించినట్లవుతుంది.
రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించక మానదు. కానీ ఏపీ, తెలంగాణ సీఎంలకు పార్టీలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయగలమని చెప్పుకునే అవకాశం లభించింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ హాజరు కావడం లాంఛనప్రాయమే కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందనే చక్కటి సందేశం పంపగలిగారు.
ఇంతకాలం రాష్ట్రాల మధ్య విభజన రేఖ గీసినట్లు పారే నదీ జలాలు, హొస్పేటలో జరిగిన ఈ కార్యక్రమం తర్వాత నదీ జలాలే రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక ముందు కూడా మూడు రాష్ట్రాల మధ్య ఈ స్పూర్తి కొనసాగితే బాగుంటుంది.




