ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి చూస్తున్నప్పుడు ‘నా ఖర్మ ఎందుకిలా కాలిపోయింది..’ అనే సినిమా పాట గుర్తొస్తే తప్పు కాదు.
‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని సగర్వంగా చెప్పుకుంటూ అన్న కోసం కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేశారు. అన్న కోసం ఆమె పడని కష్టం లేదు. చేయని త్యాగం లేదు. కానీ అన్న సిఎం కాగానే పార్టీని, చివరికి రాష్ట్రాన్ని వదిలిపోవాల్సి వచ్చింది పాపం.
అయినా సరే ఆమె ధైర్యం కోల్పోలేదు. తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొని మళ్ళీ కాళ్ళు అరగదీసుకున్నారు. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు.. సెంటిమెంట్ బలంగా మెయింటెయిన్ చేస్తున్నారని తెలిసి కూడా ‘రాజన్న బిడ్డని నేను.. రాజన్న రాజ్యం తెస్తా చూడు’ అంటూ మళ్ళీ కాళ్ళు అరగదీసుకున్నారు.
వందల కోట్లు పెట్టుబడి పెట్టి పెద్ద హీరోతో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందనే గ్యారెంటీ లేనట్లే, ఆమె పార్టీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పార్టీపై పెట్టిన పెట్టుబడి వృధా అయ్యింది. మళ్ళీ కాళ్ళ నొప్పులు మిగిలాయి.
కానీ కాంగ్రెస్ అధిష్టానం బుర్రలో పుట్టిన పురుగు ఆమెని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేసింది.
కాంగ్రెస్ అధిష్టానం ఆశించినట్లే ఆమె జగనన్నపై విరుచుకుపడ్డారు. ఎన్నికలలో వైసీపీ గెలవకుండా అడ్డుపడగలిగారు. కానీ ఆమె మాత్రం గెలవలేకపోయారు.
ఈలోగా జగన్-షర్మిల ఆస్తుల పంచాయితీ కూడా బయటపడింది. ఆమెకు, ఆమె బిడ్డలకు జగన్ తీరని అన్యాయం చేశాడని తల్లి విజయమ్మ లిఖితపూర్వకంగా సర్టిఫై చేసినా చలనం లేదు. ఎందుకంటే ఎంత చెల్లెమ్మయినా పంచి పెట్టేయడానికి అవేమీ సంక్షేమ పధకాలు కావు కదా?
వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దాని కాంగ్రెస్ అధ్యక్షుడుకి, అయన మాటకి చాలా విలువ ఉంటుంది. ఎప్పుడూ చాలా పని ఉంటుంది. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో దాని హడావుడిలో వైఎస్ షర్మిల క్రమంగా ఫేడ్ అయిపోయారు. పాపం షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌లో, పార్టీలో కూడా బొత్తిగా పని లేకుండా పోయింది.
కనుక చంద్రబాబు నాయుడుని, జగన్మోహన్ రెడ్డిని విడతల వారీగా విమర్శిస్తూ రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు పాపం షర్మిల!
కర్ణాటకలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. వాటిలో ఒకటి షర్మిలకు అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు వై హ్యాండ్ ఇచ్చింది.
షర్మిల లెగ్ జగనన్నకు కలిసి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడింది. కానీ పాపం ఆమె లెగ్ ఆమెకే ఐరన్ లెగ్‌లా చాల భారంగా మారింది. ఇప్పుడేం చేస్తారో? ఎలా కాలక్షేపం చేస్తారో? పాపం షర్మిల!




