పాదాల మీద నడిచే యాత్రతో తెలంగాణ రాజకీయాలలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వైస్ షర్మిల ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోయింది. నా పుట్టినిల్లు ఆంధ్రాలోనే, నేను పుట్టింది ఇక్కడే అంటూ అన్న జగన్ జైల్లో ఉన్నప్పుడు వైస్సార్ పార్టీ భారాన్నితన భుజానేసుకుని పాదయాత్రలు చేసి ‘బై బై బాబు’ అంటూ నినాదాలిచ్చి మొత్తానికి వైస్సార్ పార్టీని ఏపీలో అధికారం దిశగా అడుగులు వేయించిన ఘనత షర్మిలకు దక్కుతుంది.
‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్న షర్మిల ఇప్పుడు ‘జగనన్న వదిలేసినా బాణంగా’ మిగిలిపోయింది అంటున్నారు షర్మిల సానుభూతిపరులు. నేను పుట్టింది ఇక్కడే నా రాజకీయం ఇక్కడే అనుకున్న షర్మిలకు అధికారం అందగానే జగన్ పెద్ద షాకే ఇచ్చారు. పుట్టింటిలో నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ముగిసాయి ఇక “బై బై చెల్లమ్మ” అంటూ తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను జగన్ అత్తారింటి పంపించారు అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్.
ఇకచేస్తుందేమి లేక తెలంగాణ రాష్ట్రానికి చేరిన చెల్లెమ్మ ఇది మా అత్తారిల్లు ఇక్కడే నా జీవితం మొదలయింది. నా పిల్లలు పుట్టిన ప్రాంతం ఇది.నా తండ్రి పరిపాలించిన నేల ఇది.ఇక్కడ రాజన్న రాజ్యం స్థాపించి ఈ నేల ఋణాన్ని, తనకు జన్మనిచ్చిన వైస్సార్ ఋణాన్ని తీర్చుకుంటాను అంటూ శబధం చేసి ఇక “నేను ఆడ పిల్ల కాదు ఈడ పిల్లనే” అంటూ తెలంగాణ వైస్సార్ పార్టీని స్థాపించారు.
పాదాలు అరిగేలా నడిచినా అటు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ షర్మిలను అస్సలు పట్టించుకోలేదు. ఇక తన నడకకు సెలవిచ్చి హస్తం పార్టీ చెయ్యందుకోవాలని హస్తిన దాక వెళ్లినా చివరకు నిరాశే దక్కింది. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తనకంది వచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుని కొంత లాభపడిందనే చెప్పాలి. తన తండ్రి మరణం తరువాత జరిగిన సంఘటనలకు గాంధీ కుటుంబానికి ఎటువంటి ప్రమేయం లేదని షర్మిలతోనే ప్రకటన ఇప్పించగలిగారు కాంగ్రెస్ అధిష్టానం.
తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే, నాయకులు కండువాలు మార్చుకుంటూ తమ రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతూ నామినేషన్లతో హడావుడి చేస్తుంటే షర్మిల పార్టీ మాత్రం మోనంగా, దీనంగా పరిస్థితులను చూస్తూ ఒంటరిగా మిగిలిపోయారు. అటు పుట్టినిల్లు అని చెప్పుకున్న ఆంధ్రాలో అడుగుపెట్టే పరిస్థితి లేదు ఇటు అత్తారిల్లు అని చెప్పుకునే తెలంగాణాలో అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఇలా ‘రెంటికి చెడ్డ రేవడి” మాదిరి చెల్లమ్మ మిగిలిపోవాల్సిందేనా? ఇక చేసేదేమి లేదా?






