రెండుగా చీలిన వైయస్ కుటుంబం..!

ys-bharathi-reddy-ys-sharmila-reddy

గత ఎన్నికలలో జగన్ పక్షాన ఉన్న వైయస్ కుటుంబం మొత్తం వివేకా హత్యతో రెండుగా చీలిపోయింది. వైయస్ వివేకా హత్యలో వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి పాత్ర ఉందంటూ వివేకా కుటుంబం మొత్తం వైయస్ జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పింది. వీరి ఆరోపణలలో నిజం – న్యాయం రెండు ఉన్నాయనే వాదనతో వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా వివేకా కుటుంబానికి అండగా నిలిచింది.

ADVERTISEMENT

దీనితో ఈ ఐదేళ్ల నుండి తన తండ్రి చావుకి న్యాయం కావాలి అంటూ అటు న్యాయ పోరాటంతో పాటు ఇటు కుటుంబ పోరాటం చేస్తున్న సునీతకు షర్మిల అండగా నిలవడంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటువంటి సందర్భంలో వివేకా హంతకులకు జగన్ అండగా నిలబడ్డాను అంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ కూడా జగన్ కు బహిరంగ లేక రాయడంతో అనూహ్యంగా అవినాష్ రెడ్డి తల్లి వైయస్ లక్ష్మి ఆ లేఖకు కౌంటర్ గా జగన్ కు మద్దతుగా మరో లేఖ వదిలారు.

దీనితో ఎంతో కాలం నుండి నుండి గుట్టుగా ఉన్న వైయస్ కుటుంబంలోని రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వివేకా హత్యకు న్యాయం కావాలి, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ కు శిక్ష పడాలి అంటూ, కడప ఎంపీ గా అవినాష్ ఓటమికి సునీత, షర్మిల కడప లోప్రతి గడప తొక్కుతూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇదే అవినాష్, జగన్ గెలుపు కోసం జగన్ సతీమణి వైయస్ భారతి, అవినాష్ భార్య వైయస్ సమతా పులివెందులలో ప్రచారం మొదలుపెట్టారు.

ఇలా ఒకపక్క సునీత, షర్మిల ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తుంటే, మరో పక్క వైయస్ భారతి, వైయస్ సమతా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు వైసీపీ పార్టీ తరుపున ప్రచారం మొదలుపెట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ఇలా ఒకరి పై ఒకరు కౌంటర్ విమర్శలు చేసుకుంటూ, ఒకరి ఓటమికి మరొకరు కత్తులు దూస్తూ చేసుకుంటున్న ఈ విమర్శల ప్రక్రియను చూస్తున్న వైస్సార్ అభిమానులు రాజకీయాల కోసం ఇలా వైయస్ కుటుంబాన్ని రెండుగా చీలుస్తారా అంటూ ఆవేదన చెందుతున్నారు.

దీని పైన స్పందిస్తున్న టీడీపీ నేతలు మనమేం చేస్తామో మనకు అదే తిరిగి వస్తుందని, జగన్ ఎప్పుడు ఇతరుల కుటుంబంలోకి తొంగి చూసి వారి మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడంతో ఇప్పుడు ఆయన కుటుంబంలోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories