మాకూ మిస్డ్ కాల్స్ వస్తున్నాయిగా… వైఎస్ షర్మిల

ys-sharmila-ysrtpవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

ADVERTISEMENT

“మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారా?” అనే విలేఖరి ప్రశ్నకు, “ఏ రాజకీయ అండదండలు లేని నేను ఒంటరిగా తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, 3,800 కిమీ పాదయాత్ర చేసి, అధికార బిఆర్ఎస్ నేతల అవినీతి భాగోతాలను నిలదీసి ప్రశ్నించాను. అందుకే నన్ను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారు. ఇంత శ్రమపడి పార్టీ స్థాపించి, ఎండనక, వాననక పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసుకొన్నది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికా? కాదు కదా?విలీనం చేయాలనుకొంటే ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉందా?అసలు నేను ఏ పార్టీలో చేరాలనుకొంటే వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను ఏ పార్టీ అయినా కాదనగలదా?” అని జవాబిచ్చారు.

“తెలంగాణలో మీ పార్టీతో ఇతర పార్టీలు ఏవైనా పొత్తులు పెట్టుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయా?” అనే మరో ప్రశ్నకు సమాధానంగా, “ఇది ఎన్నికల సంవత్సరం. కనుక అన్ని రాజకీయ పార్టీలు పొత్తుల గురించి ఆలోచించడం సహజం. కానీ ఆలోచించకపోతేనే ఆశ్చర్యపోవాలి. ఢిల్లీకి చెందిన ఓ సర్వే సంస్థ తెలంగాణలో మా పార్టీకి 43 స్థానాలలో బలంగా ఉందని, ఎన్నికలలో ప్రభావితం చేయగలదని సర్వే చేసి చెప్పింది. మరి ఆలాంటప్పుడు నేను ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఓ 10,20, 30 సీట్ల కోసం బేరం చేసుకొని నన్ను నేను తగ్గించుకోవలసి ఉందా?అయితే తెలంగాణలో కొన్ని పార్టీలు మాతో పొత్తులకు ఆసక్తి చూపుతున్నాయి. మాకూ ఇతర పార్టీల నుంచి ‘మిస్డ్ కాల్స్’ వస్తున్నాయి,” అని చెప్పారు.

“పనిగట్టుకొని బెంగళూరు వెళ్ళి కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌ని కలిసి అభినందనలు తెలియజేయడం వెనుక మతలబు ఏమైనా ఉందా?” అని మరో విలేఖరి ప్రశ్నించగా, “నేను ఓ రాజకీయ పార్టీ నాయకురాలిని. ఆయనో మరో పార్టీకి నాయకుడు. వారి పార్టీ ఎన్నికలలో విజయం సాధించింది కనుక అభినందించడానికి వెళ్ళాను. అంతే,” అని వైఎస్ షర్మిల సమాధానం చెప్పారు.

నిప్పు లేనిదే పొగరాదన్నట్లు, వైఎస్ షర్మిలకు విలీనం ఆలోచన చేస్తున్నారు కనుకనే మీడియా సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చిందని చెప్పవచ్చు. అయితే హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలో ఆంద్రా ఓటర్లు చాలా మంది ఉన్నారు కనుక వారిని ఆకర్షించగలిగేవారి కోసం ఇతర పార్టీలు చూస్తాయి కనుక విలీనం లేదా పొత్తు కోసం ఆమెను సంప్రదించి ఉంటే ఆశ్చర్యం లేదు.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు తెలంగాణలో కేసీఆర్‌ ధాటిని తట్టుకోలేక, కనీసం ఉపఎన్నికలలో ఒక్క సీటు గెలుచుకోలేక చతికిలపడుతుంటే, వైఎస్ షర్మిల తప్ప మరొకరు కనిపించని వైఎస్సార్ టీపీకి తెలంగాణలో 43 స్థానాలలో బలం ఉందని సర్వే సంస్థ చెప్పిందని వైఎస్ షర్మిల చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడి కాంగ్రెస్‌ నేతలకు అభినందనలు చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎవరూ బెంగళూరు వెళ్ళలేదు. కానీ వైఎస్ షర్మిల వెళ్ళి అభినందనలు తెలిపారు. కేవలం అభినందనలు తెలపడానికేనా లేక రాజకీయ ఆలోచనతోనా?అనేది రాబోయే రోజుల్లో ఎలాగూ తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories