ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి ఇద్దరూ వారి అన్న జగన్మోహన్ రెడ్డికి, కడప వైసీపి ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డికి, వైసీపికి కొరకరాని కొయ్యాలా మారారు. వారిద్దరూ కలిసి జగన్, అవినాష్ రెడ్డిల మీద విరుచుకు పడుతుంటే, వారిని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక “వారి విజ్ఞతకే వదిలేస్తున్నా” అని అవినాష్ రెడ్డి సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటున్నారు.
జగన్, అవినాష్ సమాధానాలు చెప్పడం లేదని వారిద్దరూ ప్రశ్నించడం మానుకోలేదు. రోజూ కొత్త ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
“వివేకా హత్య తర్వాత గంగిరెడ్డి సాక్ష్యాధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ నిలబడ్డారని జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి నిన్న చెప్పడంతో షర్మిల, సునీతలకు మరో ఆయుధం అందించిన్నట్లయింది.
ఈరోజు ఉదయం వారిరువురూ కమలాపురం నియోజకవర్గంలోనే ఎన్నికల ప్రచారం చేస్తూ, రవీంద్రనాధ్ రెడ్డి చెప్పిన మాటలపై జగన్, అవినాష్ రెడ్డిలను నిలదీశారు.
సునీతా రెడ్డి కమలాపురం ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అవినాష్ రెడ్డికి ఫోన్ వస్తే వివేకా ఇంటికి వెళ్ళారట. అక్కడ గంగిరెడ్డి రక్తపు మరకలను కడుగుతుంటే ఈయన అమాయకంగా నిలబడి చూస్తుండిపోయారట! ఇదేమైనా ఏమైనా నమ్మశక్యంగా ఉందా?అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే చిన్న పిల్లోడా… అక్కడ ఏమి జరిగిందో తెలియకపోవడానికి?
వివేకా చనిపోతే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలని తెలీనంత అమాయకుడా అవినాష్ రెడ్డి? హత్య జరిగిన ఇంట్లో రక్తపు మరకలను కడిగించడం, సాక్ష్యాలను నాశనం చేయడం నేరమని తెలియదా ఈ ఎంపీగారికి?
అయినా ఇంట్లో సొంత మనిషి హత్యకు గురైతేనే పట్టించుకోనివారు మీ అందరినీ ఎందుకు పట్టించుకుంటారు? వారిని మీరు ఎలా నమ్మగలరు? ఇలా హత్యలు చేసేవారిని, హత్య రాజకీయాలు చేసేవారిని కాక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలమ్మకి ఓట్లేసి గెలిపిస్తే ఆమె మీ అందరి బాగోగులు చూసుకుంటారు,” అని సునీతా రెడ్డి అన్నారు.
వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “ఇక్కడ యాదవపురంలో చిన్న సుబ్బారాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ హత్య చేయబడ్డాడు. ఇప్పుడే ఆయన కుటుంబాన్ని ఓదార్చి వస్తున్నాము. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులే ఆయనను భూమి కోసం హత్య చేశారు. పోలీసుల కళ్లెదుటే హంతకులు తిరుగుతున్నా ఎవరికీ వారిని అరెస్ట్ చేసే ధైర్యం లేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ఇలా హత్యలు జరుగుతుంటే ఇక రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలలో ప్రజలకు భద్రత ఉంటుందా? అయినా ప్రజలు ఓట్లేసి గెలిపించేది ఇలా హత్యలు చేయడానికా? ఇలాంటి హంతకులని, వారిని ప్రోత్సహించి కాపాడుతున్నవారిని మళ్ళీ గెలిపిస్తే ఇక రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత ఉండదు. ఈ ఎన్నికలలో వైసీపిని, వైసీపి అభ్యర్దులందరినీ ఓడించి మనల్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.




