ఏ తల్లికీ రాకూడని అగ్ని పరీక్ష విజయమ్మకు ఎదురవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కొడుకు జగన్మోహన్ రెడ్డికి, కూతురు షర్మిలకు మద్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో ఆమె ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినా ఆమె పిల్లలిద్దరికీ రాజకీయాలు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు లభించాయి కంక వైఎస్ కుటుంబానికి మేలే జరిగిందని చెప్పవచ్చు.
వైఎస్ షర్మిల ఏ కారణంతో అన్న జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణ వెళ్ళిపోయినప్పటికీ ఆమె నిర్ణయం విజయమ్మకు అప్పుడు చాలా ఉపశమనం కలిగించి ఉండవచ్చు. పిల్లలిద్దరి మద్య గొడవలు సమసిపోయాయని సంతోషపడి ఉండవచ్చు.
కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో సెటిల్ అయిపోయాడు కనుక కూతురు షర్మిలని కూడా తెలంగాణలో సెటిల్ చేద్దామని ఆమెకు తోడుగా విజయమ్మ కూడా వెళ్ళారు. ఈ కధ ఇలా సాగుతూ కూతురు షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో సెటిల్ అయిపోయినా నేడు విజయమ్మకు ఈ అగ్నిపరీక్ష, మనోవేదన ఉండేవే కావు. కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేలా ఉంది!
వైఎస్ షర్మిల ఆమెతో పాటు విజయమ్మ కూడా ఏపీకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత ‘జరుగుతున్న కధ’ అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అదంతా మళ్ళీ చెప్పుకోనవసరం లేదు.
ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. కొడుకు జగన్మోహన్ రెడ్డి ‘మేమందరం సిద్దం’ అంటున్నప్పుడు విజయమ్మ ఆయన కోసం దేవుడిని ప్రార్ధించి, ఎన్నికలలో విజయం సాధించాలని దీవించి పంపారు.
మొన్న కూతురు షర్మిల కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా పట్టుకొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పుడు, విజయమ్మ ఆమె వెంట ఉన్నారు. అలాగని ఆమెను కూడా గెలిపించాలని దేవుడిని కోరుకోలేరు. ఒకవేళ కోరుకొన్నా ఆ దేవుడు కూడా ఇద్దరినీ ఒకేసారి గెలిపించలేడు.
ఇప్పుడు కొడుకు, కూతురు ఇద్దరూ ఎన్నికల ప్రచారానికి కూడా బయలుదేరారు. కనుక ఇప్పుడు విజయమ్మ ఏ గట్టున ఉండాలో తేల్చుకోవలసిన సమయం వచ్చేసిన్నట్లే!
ఏ తల్లైనా కూతురు కంటే కొడుకే ముఖ్యం అనుకొంటుంది. కనుక ఒకవేళ కొడుకు వైపు ఉంటే కూతురు షర్మిల వివేకానంద రెడ్డి హత్య గురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.
అలాగని కూతురిని ‘కాలాకేయ సైన్యం’ చీల్చి చెండాడుతుంటే చూస్తూ తల్లి మనసు తట్టుకోలేదు. కనుక కూతురు పక్షాన్న నిలబడితే కొడుకునే నిలదీసి ప్రశ్నించాల్సి ఉంటుంది. కూతురు పక్షాన్న నిలబడటం అంటే నా కొడుకుని గెలిపించవద్దని ప్రజలకు చెప్పేసిన్నట్లే అవుతుంది కూడా.
కనుక ఆమె ఏ గట్టునా ఉండలేరు కనుక ఓ రెండు నెలలు కళ్ళు, చెవులు, మనసూ అన్నీ మూసుకొని దేవుడిని ప్రార్దనలో కాలక్షేపం చేయక తప్పదేమో?




