ఏపీలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో వారి తల్లి విజయమ్మ ఎవరినీ సమర్ధించలేక, వ్యతిరేకించలేక చాలా సతమతమయ్యారు.
కడప నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న షర్మిల, వివేకా హత్య గురించి జగన్, అవినాష్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ‘విజయమ్మకు అన్నీ తెలుసని దమ్ముంటే ఆమె చేత మాట్లాడించాలని’ అన్నకు సవాలు కూడా విసిరారు. తద్వారా జగన్, అవినాష్ రెడ్డిలకు షర్మిల అన్ని దారులూ మూసేసిన్నట్లు చెప్పవచ్చు.
ఒకవేళ ఆయన తల్లిపై ఒత్తిడి చేసి ఆమె చేత ‘క్లీన్ చిట్’ ఇప్పించుకున్నా అప్పుడు షర్మిల, సునీతారెడ్డి మరిన్ని మరిని కొత్త ప్రశ్నలు సందించి, ఈ హత్య కేసులో ఎవరికీ తెలియని మరిన్ని కొత్త విషయాలు బయటపెట్టే ప్రమాదం ఉంది.
ఇప్పటికే షర్మిల, సునీతారెడ్డిలకు జవాబు చెప్పుకోలేక పోతుండటం వలన రాష్ట్రంలో వైసీపి గ్రాఫ్ పడిపోతోంది. కనుక విజయమ్మ చేత మాట్లాడించి మరిన్ని సమస్యలు తెచ్చుకోవడం కంటే ఆమెను ఈ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచితే మంచిదని రహస్యంగా అమెరికా పంపించేసిన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమెకు బదులు మేనత్త వైఎస్ విమల చేత వారికి జవాబులు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
విమలమ్మ శనివారం కడపలో మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ ఇంటి గౌరవాన్ని, ప్రతిష్టను షర్మిల, సునీతారెడ్డి ఇద్దరూ బజారు కీడ్చుతుండటం మా అందరికీ చాలా బాధకలిగిస్తోంది. వారు వివేకాను అవినాష్ రెడ్డి హత్య చేస్తుంటే చూశారా?మరి ఏవిదంగా ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు?
ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని వారు అమాయకుడు, సజ్జనుడు అయిన అవినాష్ రెడ్డిని హంతకుడని నిందిస్తూ, ఆయనను జగన్ కాపాడుతున్నారంటూ ఆరోపిస్తూ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళే హంతకులు ఎవరో తీర్పు చెప్పేస్తే మరి ఈ పోలీసులు, కోర్టులు ఎందుకు?
జగన్, అవినాష్ రెడ్డిలపై వ్యక్తిగత కక్షతోనే వారిద్దరూ ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు తప్ప వారి ఆరోపణలను నిరూపించగలరా?
వాళ్ళిద్దరూ ఇన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నా జగన్, అవినాష్ రెడ్డి ఇద్దరూ వారి గురించి ఒక్క ముక్క తప్పుగా మాట్లాడటం లేదు. ఇదే వారి మంచితనానికి నిదర్శనం.
వైఎస్ షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవు కనుకనే తెలంగాణలో రాజకీయాలు చేయలేకపోయారు. జగన్ రాజకీయ శత్రువులతో చేతులు కలిపి ఏపీకి వచ్చి కుట్రలు చేస్తున్నారు. మేనత్తగా చెపుతున్నాను… ఇప్పటికైనా షర్మిల, సునీతారెడ్డినోరు మూసుకుంటే మంచిది,” అని హెచ్చరించారు.
గతంలో ఎన్నికలప్పుడు విజయమ్మ, షర్మిల ఇద్దరినీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. తర్వాత ఇద్దరినీ బయటకు పంపించేశారు. ఇప్పుడు చెల్లి షర్మిల నిలదీసి ప్రశ్నిస్తుంటే, తల్లి చేత సమాధానాలు చెప్పించలేక ఆమెను అమెరికా పంపించేసి మేనత్త విమల చేత మాట్లాడిస్తున్నారు.
ఇలా ఎవరెవరి చేతో వఖల్తా చెప్పించుకునే బదులు జగన్, అవినాష్ రెడ్డి ఇద్దరూ స్వయంగా చెల్లెళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారి నోళ్ళు మూయించవచ్చు కదా?
అయినా సింహం, పులి, అర్జునుడుకి మేనత్త వఖల్తా అవసరమా?అవసరమైతే ఇంత కంటే దయనీయ స్థితి ఏముంటుంది?




