దేశ రాజకీయాల్లో సంచలన విషయాలను బయటపెట్టడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన ‘రిపబ్లిక్’ ఛానల్ అధినేత ఆర్నాబ్, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ కధనం వెలువరించారు. ఇది కొత్తదేమీ కాకపోయినా… ఆధారాలు లేకుండా ఆర్నాబ్ చెప్పరన్న నమ్మకం వీక్షకులలో ఉండడంతో… జగన్ బండారం బయట పడినట్లయ్యింది. ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటన వెళ్ళిన సందర్భంలో… జగన్ తనను కేసుల నుండి బయటపడేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారని, తెలుగుదేశం పార్టీ వర్గాలు భారీ స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
అయితే ఏపీలో రెండు ప్రత్యర్ధి పార్టీలు కావడంతో, వీటికి ప్రాధాన్యత లభించినప్పటికీ, కేవలం ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ తాజాగా ఇదే అంశాన్ని ‘రిపబ్లిక్’ ఛానల్ అధినేత ఆర్నాబ్ బల్లగుద్ది చెప్తున్నారు. బిజెపితో చేతులు కలపడానికి జగన్ ఉత్సాహం చూపుతున్నారని, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో జరిపిన చర్చలు విఫలం అయిన తర్వాత జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని, ప్రస్తుతం బిజెపి నేతలతో జగన్ నిత్యం టచ్ లో ఉంటున్నారని ఈ కధనంలో పేర్కొన్నారు.
బిజెపి అధిష్టానానికి – జగన్ కు మధ్య జనార్ధన రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని, గతంలో జగన్ ముగ్గురు కేంద్రమంత్రులను కలవడంలో కూడా ఇతని పాత్రే ఉందని, ఎన్డీఏలో చేరడానికి జగన్ పూర్తి ఆసక్తితో ఉన్నప్పటికీ, బిజెపి – టిడిపిల బంధం ప్రస్తుతం ధృడంగా ఉంది గనుక, ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు గనుక వేచిచూసే ధోరణిలో ఉన్నట్లుగా ప్రచురితం చేసిన ఈ కధనం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. నంద్యాల ఉప ఎన్నికలలో విజయం సాధిస్తే, జగన్ కు మార్గం సుగమం అవుతుందేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే అసలు బిజెపితో తాను కలిసేది లేదు అంటూ గతంలో చాలా సందర్భాలలో జగన్ బహిరంగ వేదికలపై చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ‘మాట తప్పను, మడమ తిప్పను’ అనేది జగన్ తొలినాళ్ళ నుండి అవలంభించిన విధానం. మరి తాజా కధనం ప్రకారం అయితే ఆ నినాదానికి పూర్తి విరుద్ధంగా ‘మాట తప్పుతారు, మడమ తిప్పుతారు’ అన్న నానుడిని ప్రత్యర్ధి వర్గాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.


