వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన “ఆపరేషన్ ఆకర్ష్”తో ప్రతిపక్ష పార్టీ సభ్యులే కాదు, జయసుధ వంటి ప్రముఖ సినీ సెలబ్రిటీలు కూడా రాజకీయ తెరంగ్రేటం చేసారు. వచ్చి రావడంతో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా అనూహ్య విజయం సాధించడంతో వైయస్ కు విధేయురాలిగా మారిపోయారు జయసుధ. అదే కృతజ్ఞతను వైయస్ కాలం చేసిన తర్వాత జగన్ కు కూడా ప్రదర్శించారు.
అయితే కాలక్రమేణా జగన్ రాజకీయ ప్రావీణ్యంతో విసుగెత్తిన జయసుధ, వైసీపీ అధినేతకు దూరంగా జరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుండే పోటీ చేసారు. అయితే ఈ సారి పరాజయం ఆమెను పలకరించడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ నేటి నుండి “సైకిల్” మీద పయనమవనున్నానని ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన జయసుధ…, చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన చంద్రబాబు, ప్రస్తుతం ఏపీ అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసమే తానూ తెలుగుదేశం పార్టీలో చేరారని జయసుధ ప్రకటించారు. అయితే ఒక్క విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.
ఒకప్పుడు తెలంగాణాలో ప్రాతినిధ్యం వహించిన జయసుధ ప్రస్తుతం ఏపీపై దృష్టి కేంద్రీకరిస్తారా? లేక మునుపటి మాదిరే తెలంగాణాలో కొనసాగుతుందా? అనేది చూడాలి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో టిడిపిలోకి కొత్త వారి ఎంట్రీ టి-టిడిపి వర్గాలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది.





