ఏపీ రాజకీయాలలో కుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందనేది వాస్తవం. కనుక అన్ని పార్టీలు ఆ లెక్కనే రాజకీయాలు చేస్తుంటాయి. ఎన్నికలలో అభ్యర్ధులను నిర్ణయిస్తుంటాయి. ఆ లెక్కనే సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటాయి. వీటి కోసం పార్టీలలో ఎస్సీ సెల్, బీసీ సెల్ వంటివి కూడా ఏర్పాటు చేసుకుంటాయి. ఇప్పుడు వైసీపీ మరో అడుగు ముందుకు వేసి ‘కులాధ్యక్షులను’ కూడా నియమించుకుంటోంది.
ఇందుకు తాజా ఉదాహరణగా, వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన ఈ రెండు ఆదేశాలున్నాయి.
“పార్టీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల మేరకు, శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అంబటి శ్రీనివాసరావు గారిని పార్టీ “రాష్ట్ర పోలినాటి వెలమ విభాగ అధ్యక్షులు”గా నియమించడమైనది.
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్ గారిని పార్టీ “రాష్ట్ర శెట్టి బలిజ విభాగ అధ్యక్షులు”గా నియమించడమైనది.
ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ ఈవిదంగా వివిధ కుల సంఘాలను ఆకట్టుకొని, వాటికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. తద్వారా రాష్ట్రంలో అన్ని కులాల మద్దతు కూడగట్టి వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైసీపీ ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటోందని ఈ నియామకాలు స్పష్టం చేస్తున్నాయి.




