YSRCP Congress Party office demolished

ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టిన జగన్ కు ఐదేళ్ల తరువాత నిర్మాణాల విలువ తెలిసొచ్చిందా.? లేక కూల్చివేతల తాలూకా ఆవేదన అర్దమయ్యిందా.? వందల కోట్ల ప్రజాధనంతో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసింది జగన్ ప్రభుత్వం.

అయితే నాడు అధికారంలో ఉన్నప్పుడు కూల్చివేతలను సమర్ధించుకున్న జగన్ సర్కార్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే అవే అక్రమ నిర్మాణాల కూల్చివేతలను తప్పుబడుతూ న్యాయస్థానాలను ఆశ్రయించడం, విధ్వంసకర పాలన అంటూ గగ్గోలు పెట్టడం చూస్తుంటే అప్పుడు ఒప్పు…ఇప్పుడు తప్పేలా అయ్యింది అంటూ వైసీపీ పై ప్రశ్నల వర్షం కురుస్తుంది.

Also Read – అరగంట క్రితం అవంతి రాజీనామా… జనసేనలోకేనా?

తాడేపల్లిలో నిర్మాణ దశలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారనే ఆదేశాలతో ఈ రోజు ఉదయం దీనిని అక్రమ కట్టడం కింద అధికారులు కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతను అప్రాజాస్వామ్యమని, కక్ష్య సాధింపు చర్య అని, కూల్చివేతలతో పాలన మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వమని సోషల్ మీడియాలో సుమతి శతకాలు వల్లెవేస్తున్నారు వైసీపీ నేతలు.

చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకు వెళ్లారు, ఒక నియంతలా దాదాపు పూర్తి కావస్తున్న భవనాన్ని కూల్చివేశారు అనే బాధతో గగ్గోలు పెడుతున్న జగన్ కు పూర్తిగా తయారైన ప్రజా వేదిక భవనాన్ని కూల్చినప్పుడు నొప్పి తెలియలేదా.? గత టీడీపీ ప్రభుత్వం మీద కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే అప్పుడు జగన్ సర్కార్ ప్రజా వేదికను కూల్చిందా.? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

Also Read – జమిలి బిల్లు సరే… ఆచరణ సాధ్యమేనా?

అది నిజమని వైసీపీ అంగీకరిస్తే…ఇప్పుడు వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి అర్హత కూడా ఉండదు. అలాగే అది నిజమని ఒప్పుకోకపోయినా అప్పుడు అక్రమ కట్టడాలు తప్పయితే ఇప్పుడు కూడా అక్రమ నిర్మాణాలను కూల్చడం తప్పుకాదని వైసీపీ అంగీకరించాల్సి ఉంటుంది. “రెంటికి చెడ్డ రేవడి” మాదిరి వైసీపీ ఈ రెండు సందర్భాలలోనూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోయింది.

చట్టం, న్యాయం, ధర్మం అంటూ గత ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తానూ మరిచిపోయిన చాల పెద్ద పెద్ద బరువైన పదాలను ప్రతిపక్షంలోకి వచ్చిన ఐదు రోజులకే గుర్తుచేసుకుంటుంది వైసీపీ. అసలు చట్టాలే బలంగా పని చేస్తే జగన్ ఈ స్థాయిలో ఉండేవారేనా.? న్యాయవ్యవస్థ లో లొసుగులు లేకపోతే గడిచిన ఐదేళ్లుగా వైసీపీ కోర్ట్ నిర్ణయాలను తోసిపుచ్చేదేనా.?

Also Read – ‘గుడ్డి’ ప్రభుత్వానికి…’గుడ్డు’ మంత్రికి…’గూగుల్’ విలువ తెలుసా.?

అసలు ధర్మం అనేది జగన్ కు తెలిస్తే ఎకరం విలువ కోట్లలో ఉన్న తాడేపల్లి వంటి రాజధాని ప్రాంతంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం ఎకరాకు 1000 రూపాయల అద్దె చెల్లించి సుమారు 90 ఏళ్ళ పాటు పార్టీ కార్యలయానికి లీజుకు తీసుకుంటారా.? జగన్ తాడేపల్లి ప్యాలస్ ప్రాంతంలో ఎవరైనా సామాన్యుడికి గజం 1000 రూపాయలకు జగన్ అద్దెకు ఇవ్వగలరా.?

ప్రభుత్వ భూములలో ప్రైవేట్ ఆస్తుల నిర్మాణం అది పార్టీ కార్యాలయం వంటి వ్యక్తిగత ఆస్తిని నిర్మించడానికి జగన్ కు ఆ అధికారం ఎవరిచ్చారు.? ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత నిజమైతే కూల్చివేతల ఆక్రోశం తెలియాలంటే కూల్చివేతలే జరగాలి అని నేడు వైసీపీ చేస్తున్న ఆక్రందనలతో ప్రజలకు స్పష్టమయింది.

అయితే ఈ ప్రతి చర్యలో ఎవరిదీ తప్పు..ఎవరిదీ ఒప్పు తెలియాలంటే జగన్ కూడా మరో ఐదేళ్ళు వేచి ఎన్నికలనే ప్రజా కోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వం తప్పు చేసిందా.? లేక న్యాయం చేసిందా.? అనేది స్పష్టమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.