వైసీపీ చాలా చురుకుగా రాజకీయాలు చేస్తుంటుంది. ప్రతీసారి కూటమి ప్రభుత్వం కూడా ఊహించని వ్యూహాలతో వస్తుంటుంది. అసలు వైసీపీ రాజకీయాలు చేసే విధానమే పూర్తి భిన్నంగా ఉంటాయి.
అంతేకాదు .. ఒక అబద్దాన్ని లేదా తప్పుడు విధానాన్ని బలంగా నమ్ముతూ, ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంటుంది.
అది అమరావతి కావచ్చు లేదా పోలవరం, భోగాపురం, పరిశ్రమలు, పెట్టుబడులు, డీఎస్సీ ఏదైనా కావచ్చు. ప్రతీసారి బౌండరీ అవతలే నిలబడి రాంగ్ షాట్స్ కొడుతూ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తుంటుంది. చివరికి నవ్వులపాలవుతుంటుంది.
ఇందుకు తాజా ఉదాహరణ డీఎస్సీపై అది చేస్తున్న వాదనలు, ఆందోళనలు కనిపిస్తున్నాయి. వైసీపీ 5 ఏళ్ళ పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ తీయలేదు. బొత్స సత్యనారాయణ అయిష్టంగానే విద్యాశాఖ మంత్రి పదవి తీసుకున్నారు. నాడు శాసనసభలో డీఎస్సీపై చర్చ జరిగినప్పుడు, “రాష్ట్రంలో ఖాళీలు లేకుండా డీఎస్సీ ఎలా తీస్తాము?” అని బొత్స ప్రశ్నించారు. కానీ 2024 ఎన్నికలకు ముందు హడావుడిగా డీఎస్సీ ప్రకటించారు.
అలాంటి వ్యక్తి చేత శాసన మండలిలో డీఎస్సీ గురించి మాట్లాడిస్తున్నారు జగన్. తద్వారా మండలిలో అయనని బలిపశువుగా మార్చారని చెప్పక తప్పదు. ఇంకా దురదృష్టం ఏమిటంటే, మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఆయనకు దేని గురించైనా పూర్తి అవగాహనతో మాట్లాడటం అలవాటు.
డీఎస్సీ గురించి మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణని అయన సూటిగా ప్రశ్నించారు. ‘డీఎస్సీ అంటే టీడీపి… టీడీపి అంటే డీఎస్సీ. మీ ప్రభుత్వ హయంలో ఐదేళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా తీయని మీరా మమ్మల్ని ప్రశ్నించేది?
డీఎస్సీ గురించి చర్చిద్దామంటారు. కానీ మీ ప్రశ్నలకు మేము సమాధానం చెపుతుంటే గొడవ చేస్తారు. మళ్ళీ మీరే సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించాలని చెప్తున్నారు. డీఎస్సీపై చర్చలో పాల్గొనే ఉద్దేశ్యం లేనప్పుడు వచ్చి ఏం ప్రయోజనం?
డీఎస్సీ గురించి మీరు అడిగే ప్రతీ ప్రశ్నకు మేము సమాధానం చెప్తామంటున్నాము కదా? అయినా మీ వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు?దీనిపై సభలో చర్చ జరగకూడదనా?చర్చకు ఎందుకు భయపడుతున్నారు?” అని నిలదీశారు.
శాసనసభ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాగూ హాజరుకారు. యుద్ధ రంగంలో అందరి కంటే ముందు రాజు, సైన్యాధ్యక్షుడు ఉండాలి. కానీ వైసీపీ చేస్తున్న ఈ యుద్ధంలో జగన్ ఎక్కడా కనిపించరు! ఎందువల్ల?
అంటే తమవి భూటకపు పోరాటాలని జగన్ భావిస్తున్నారా?లేక వీటిలో పాల్గొనకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారా? ఈ లెక్కన మండలిలో బొత్స సత్యనారాయణని బలిచేస్తున్నట్లుగానే రాష్ట్రంలో వైసీపీ నేతలను బలి చేస్తున్నారా?వారే చెప్పాలి.




