రాజకీయాలలో ఉన్నవారు ప్రజల మధ్యన ఉండాలి. ప్రజా ప్రతినిధులైతే చట్టసభలలో ఉండాలి. కానీ ఇంట్లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు రచిస్తూ, దుష్ప్రచారాలతో ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీయాలనుకోవడం, రాజకీయంగా పైచేయి సాధించి అధికారంలోకి రాగలమని అనుకోవడం.. ఏ రకం రాజకీయం?
నీట్ అవకతవకలపై సీపీజీ చేసిన ఆందోళనలు విజయవంతం అవడంతో, దేశంలో ప్రతిపక్ష పార్టీలకు చాలా స్ఫూర్తి కలిగించింది.
వాటిలో వైసీపీ కూడా ఒకటి. ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ అది చేసిన దుష్ప్రచారానికి సీపీజీ ఆందోళనలు స్ఫూర్తిగా తీసుకొని రీస్టార్ట్ చేసింది.
ప్యాలెస్ ఆదేశం మేరకు వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు ప్రారంభించాయి. డీఎస్సీలో అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారి డిమాండ్.
అయితే దీనిపై కోర్టుని ఆశ్రయించి మళ్ళీ ఆ పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నట్లు? అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను తప్పుపడుతున్నప్పుడు డీఎస్సీపై మళ్ళీ అదే సీబీఐ విచారణకు ఎందుకు పట్టుబడుతున్నట్లు? అనే ప్రశ్నలకు సమాధానం ఉండదు.
‘కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదటి వికెట్ పడిందని, ఇది అంతం కాదని ఆరంభం మాత్రమేనని’ సీపీజీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అన్నారు. అంటే మోడీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు అనుమానించాల్సి ఉంటుంది.
వైసీపీ కూడా సీపీజీ స్ఫూర్తితో, అదే పద్ధతిలో ముందుకు సాగుతోంది. కనుక కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇలాంటి నకిలీ ఉద్యమాలు చేస్తున్నట్లు అనుమానించాల్సి ఉంటుంది.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలని, తాను ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. అదేమీ రహస్యం కాదు.
కానీ అందుకు ప్రజాస్వామ్య పద్ధతులు పాటిస్తూ.. అంటే శాసనసభకు, ప్రజల మధ్యకు వచ్చి ప్రయత్నిస్తే ఎవరూ వేలెత్తి చూపరు.
కానీ ఈవిధంగా కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలతో, రప్పా రప్పా అని ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజలను బెదిరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి, తాము అధికారంలోకి రావాలనుకోవడమే చాలా అభ్యంతరకరం.
ఇలాంటి రాజకీయాలతోనే బిహార్‌లో అరాచకత్వం ప్రబలిపోయింది. మాజీ సీఎం నితీష్ కుమార్ దానిని సరిచేసేందుకు దశాబ్దాలుగా ప్రయత్నించినప్పటికీ, దానిలో 50 శాతం కూడా సరిచేయలేకపోయారు.
కానీ అలాంటి దుస్థితికి చేరుకోబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారు. కనుక ఈ కుట్రలు, కుతంత్రాల నుంచి కూడా వారే రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.




