నేడు జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపి అభ్యర్ధి లావణ్య తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఇక్కడ మరో కొత్త వాదన వినిపించారు. ఐదేళ్ళు పాలించమని ప్రజలు తనని ఎన్నుకుంటే 57 నెలలకే తన గొంతు పట్టుకొని దింపేయాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
అయితే 5 ఏళ్ళ పదవీకాలం పూర్తవుతోంది కనుకనే ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకే తాను ఎన్నికల ప్రచారం చేస్తున్నాననే విషయం ప్రజలు గ్రహించలేరన్నట్లు జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
తెలంగాణలో తన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తూ, జగన్ సహకారాన్ని ఆశిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. ఆయన ఆరోపణలకు ఆధారాలు చూపలేదు కనుక వాటిని నమ్మలేము కానీ కేసీఆర్-జగన్ బంధం గురించి తెలిసినవారికి, రేవంత్ ఆరోపణలలో ఎంతో కొంత నిజముందని అర్దమవుతుంది.
కానీ 5 ఏళ్ళు పదవీకాలం పూర్తిచేసుకొని ఎన్నికలకు వెళుతూ కూడా తన ప్రభుత్వం గొంతు నొక్కేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
తన గొంతు నొక్కడం అంటే ఎన్నికలలో వైసీపి కనుసన్నలలో పనిచేస్తునందుకు డిజిపి తదితర పోలీస్ అధికారులను బదిలీ చేయడమే. అక్కచెల్లెమ్మలకు మేలు చేయాలనుకుంటే మే 14 నుంచి కూడా చేయవచ్చు. కానీ పోలింగ్‌కు ముందు ‘మేలు’ చేయాలనుకుంటున్నారు. దేనికో అందరికీ తెలుసు.
అందుకే ఈసీ అభ్యంతరం చెప్పింది. దాని కోసం ‘మీ బిడ్డ’ కోర్టులో పోరాటాలు చేస్తున్నాడని ఇదే తన గొంతు నొక్కడం అని జగన్ చెప్పుకుంటున్నారు. అంటే ఎప్పటిలాగే వైసీపి మూకలు చెలరేగిపోతూ, ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ, లబ్ధిదారులకు పోలింగ్ రోజు వరకు ‘మేలు డబ్బులు’ పంచనిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతున్నట్లు జగన్ ఒప్పుకుంటారేమో?
మంగళగిరిలో ఇద్దరు అభ్యర్ధులను మార్చినప్పుడే వైసీపి ఓటమి ఖరారు అయిపోయింది. తాజాగా మంగళగిరిలో ఓ వైసీపి నేత ఇంట్లో రూ.25 కోట్లు పట్టుబడిన్నట్లు ఓ వార్త వచ్చింది. ఎలాగూ పోలింగ్‌కు ముందు ‘మేలు’ చేస్తున్నప్పుడు, మళ్ళీ వేరేగా ఈ డబ్బులు పంచడం దేనికి? అంటే గెలుస్తామని నమ్మకం లేదనేగా?
చివరిగా ఒక్క మాట: చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్‌లాగ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు చేయలేదు కనుకనే జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగలిగారు. చేయగలిగి ఉంటే ఇన్నేళ్ళు జగన్ అధికారంలో ఉండగలిగేవారా?
ఈ 5 ఏళ్లుగా జగన్ చేతిలో చంద్రబాబు నాయుడు, టిడిపి శ్రేణులు మాత్రమే కాదు… రాష్ట్ర ప్రజలే కూడా చాలా నరకం అనుభవించారు. కనుకనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రజలందరూ మే 13వ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బహుశః శాసనసభ ఎన్నికల కోసం ప్రజలు ఇంతగా ఎప్పుడూ ఎదురుచూసి ఉండరేమో?






