‘సీట్ల పంపకాలు’ ఒక పక్కా..’తాయిలాల పంపకాలు’ మరో పక్క..!

YCP Leaders

ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ – జనసేనలు బీజేపీతో పొత్తు ఒకకొలిక్కి రాకపోవడంతో కనీసం తమ అభ్యర్థులకు సీట్ల పంపకాలు కూడా మొదలుపెట్టలేదు. అధికార వైసీపీ మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థులకు మార్పులు చేర్పులతో కూడిన సీట్ల పంపకాలు షురూ చేసి నియోజకవర్గాలలో ప్రచారాలకు సిద్ధం చేసింది.

ఇన్నాళ్లుగా జగన్ అండ్ కో వై నాట్ 175 అంటుంటే ఇది వారి పాలన మీద వారికీ ఉన్న ఆత్మ విశ్వాసం అనుకున్న వారికీ ఇప్పడిప్పుడే కళ్ళు తెరిపిస్తున్నారు వైసీపీ నాయకులు. “ఇది జగన్ పాలన మీద ఉన్న నమ్మకంతో కాదు తమ ప్రలోభాల మీద ఉన్న నమ్మకంతో” ఈ నినాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు అనేది. వైసీపీ ఎన్నికల చిత్రమైన ఫ్యాన్ గుర్తు, జగన్, ఆ ప్రాంత అభ్యర్థి చిత్రాలను ముద్రించిన సంచిలో 2 వేల నగదు, కుక్కర్ సెట్, ఒక ప్లాస్క్ వంటి గిఫ్ట్ లను వాలంటీర్లకు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పంపిణి చేస్తున్నారు అదిఆకార్ వైకాపా నాయకులు.

ADVERTISEMENT

దీనితో జగన్ అండ్ కో తమ గెలుపుకి సహాయపడే ఏ అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరనే విషయం సుస్పష్టమయిపోయింది. ఓటర్లను ప్రభావితం చేయగలిగే వాలంటీర్ల నుండి సినిమా దర్శకుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టని వైసీపీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను తనవైపుకు ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టి 2024 ఎన్నికలలో తన గెలుపుకి బాటలు వేసుకుంటుంది.

ఈసారి ఎన్నికలు ప్రతిపక్షానికి ఎంత కీలకమో అధికార పక్షానికి అంత అవసరం కూడా. కాబట్టి తమ గెలుపు కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కుతాం, ఎన్ని అవకతవకలైన చేస్తాం, ఎన్ని నిబంధనలైనా ఉల్లంగిస్తాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గా పోటీకి సిద్దమైన వెలంపల్లి తనవంతుగా వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ప్రలోభ పెట్టి తమ చెప్పుచేతలోకి తెచ్చుకున్నారు.

అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన ఫోటో, తన కుమారుడి ఫొటోలతో కూడిన సంచులలో సంక్రాతి కానుకల రూపంలో కుక్కర్లు పంపణీ చేసారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల పై విమర్శలు చేసే మరో మంత్రి నేను సంబరాల రాంబాబునే అంటూ సగర్వంగా చెప్పుకునే అంబటి రాంబాబు సోషల్ మీడియాలో మేకపోతు గాంభీర్యాలు పోతూ వాస్తవంలో మాత్రం ఇలా తెర వెనుక పంపిణీలు చేస్తూ తన గెలుపుకి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

జోహార్ వైస్సార్ అంటూ వైస్సార్, జగన్ ఫోటోలను ముద్రించిన ఒక పేపర్ బాగ్ లో జగన్ చిత్రం తో కూడిన ఒక టీ కప్పు, ఒక చీర, షర్ట్, ప్యాంట్ పెట్టి తన సొంత నియోజకవర్గమైన సత్తెనపల్లిలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులను విందు భోజనానికి ఆహ్వానించి రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఈ తాయిలాలను ముట్టచెప్పారు. ఇక్కడ కూడా అంబటి తన స్వామి భక్తి చాటుకోవడం విశేషం.

అయితే వీరందరూ ఓటర్లను, ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ఉద్యోగులను తాయిలతో తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంటే జోగి రమేష్ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. మతం పేరుతో రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఒక మతం వారిని ఆకర్షించే ప్రయత్నం చేసారు. “పుట్టుకతోనే క్రెస్తవులైన మనమంతా యేసు బిడ్డను” మరోసారి రాష్ట్రానికి ముఖ్యంమత్రిగా, నన్ను ఈ ప్రాంత ఎమ్మెల్యే గా గెలిపించుకుందాం అంటూ పాస్టర్లకు ,దైవ సహాయకులకు పిలుపునిచ్చారు.

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా గతంలో ఇదేతరహా వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో మత రాజకీయాలను ప్రోత్సహించారు. ఇలా మతం మాటున, కులం చాటున…రాజకీయాలు చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలకు తెరలేపి, అధికారం అనే కవచాన్ని అడ్డుపెట్టుకుని, భయపెట్టి, బెదిరించి ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని చూడడమేనా పులివెందుల పులి అని చెప్పుకుంటున్న వారి నైజం..?

రాష్ట్రంలో ఎన్నికలకు ముందే ఇన్ని రకాల ప్రలోభాలతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతుంటే ఎన్నికలను సజావుగా నడిపించవలసిన బాధ్యత ఉన్న ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకులేకపోతుంది..? అధికార పార్టీ నేతలు చేసే ఈ ప్రలోభాల పంపకాల ఫోటోలు, వీడియోలు మీడియాలో చక్కర్లు కొడుతున్న చర్యలకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది..? ఈ రకంగా అధికార పార్టీ నిబంధనలను బేఖాతరు చేస్తుంటే ఈసీ మోనంగా ఉండడం దేనికి సంకేతం..?

ADVERTISEMENT
Latest Stories