Volunters Pensions

ఈ ఐదేళ్ళలో వైసీపి ప్రభుత్వం టిడిపి, జనసేనలను దెబ్బ తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరూ చూస్తూనే ఉన్నారు. చివరి ప్రయత్నంగా పింఛన్లతో కూడా వాటిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాలంటీర్ల ద్వారా కాక ప్రత్యామ్నాయ మార్గంలో పింఛన్లు పంపిణీ చేయించాలని టిడిపి ఎన్నికల సంఘాన్ని కోరింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం మొదటి నుంచి చెపుతూనే ఉంది కనుక ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది.

Also Read – మూగబోయిన టాలీవుడ్…!

టిడిపిని దెబ్బతీయడానికి మరో గొప్ప అవకాశంగా గుర్తించిన వైసీపి ప్రభుత్వం, చకచకా పావులు కదిపింది. చంద్రబాబు నాయుడు తాను తీసిన గోతిలో తానే పడ్డారంటూ వైసీపి సొంత మీడియాలో ఓ పెద్ద కధనం ప్రచురించింది.

“ఒకటో తేదీన పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణం. ఆయనే వాలంటీర్లను అడ్డుకున్నారు లేకుంటే ఈపాటికి అవ్వతాతలకు పింఛన్లు అందేవి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌ సోషల్ మీడియాతో బాటు ఆ పార్టీ నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. దాంతో 67 లక్షల మంది చంద్రబాబు నాయుడుని తిట్టిపోస్తున్నారు,” అంటూ సాక్షి ఆన్‌లైన్‌లో పత్రికలో మంగళవారం ప్రచురితమైన కధనమే వైసీపి కుట్రని తేటతెల్లం చేస్తోంది.

Also Read – జగన్ యాత్రలు ఈసారి నల్లేరు మీద నడక కాదు…

ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో సచివాలయ సిబ్బందిని లబ్ధిదారుల ఇళ్ళకు పంపించి పింఛన్లు చెల్లించవలసి ఉండగా, లబ్ధిదారులనే సచివాలయాలకు వచ్చి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈవిదంగా వారందరినీ సచివాలయాల వద్ద పడిగాపులు కాసేలా చేసి ఇబ్బంది పెట్టి దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడు అని వారిని నమ్మించగలిగితే ఎన్నికలలో వారందరూ టిడిపికి వ్యతిరేకంగా, వైసీపికి అనుకూలంగా ఓట్లు వేస్తారని వైసీపి దురాలోచన స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read – తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటా..!

ఇది గమనించిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనాకు ఫోన్ చేసి పింఛన్‌దారులు ఎదుర్కొంటున్న సమస్య గురించి వివరించి తక్షణం అందరికీ పింఛన్లు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

అయితే సచివాలయ సిబ్బందిని లబ్ధిదారుల ఇళ్ళకు పంపించి సకాలంలో పింఛన్లు చెల్లించేస్తే, ఇటువంటి గొప్ప అవకాశం చేజారిపోతుందని భావిస్తున్న వైసీపి ప్రభుత్వం, సెర్ఫ్ సీఈవో మురళీధర్ రెడ్డి ద్వారా మరో అడ్డుపుల్ల వేసేందుకు ప్రయత్నిస్తోంది. సచివాలయ సిబ్బందికి వేరే ఇతర పనులు చాలా ఉంటాయని కనుక వారిని పంపించి పింఛన్లు చెల్లించడం సాధ్యం కాదని చెప్పించింది.

అయితే ఈ సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి జిల్లా కలక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారి అభిప్రాయాలు కోరగా గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు ఎక్కడికక్కడ సచివాలయాలు ఉన్నందున, సచివాలయ సిబ్బందిని లబ్ధిదారుల ఇళ్ళకు పంపించి పింఛన్లు చెల్లించడం పెద్ద పని కాదని పలు జిల్లాల కలెక్టర్లు చెప్పారు. ఇటీవల కులగణనతో సహా పలు కార్యక్రమాలకు వారు ఇంటింటికీ తిరిగారు కనుక పింఛన్లు పంపిణీ పెద్ద సమస్య కాబోదని జిల్లా కలెక్టర్లు చెప్పిన్నట్లు తెలుస్తోంది.

కానీ పింఛన్లు చెల్లించేందుకు వైసీపి ప్రభుత్వం తొందరపడటం లేదు. ఆలస్యం చేస్తున్న కొద్దీ లబ్ధిదారుల ఆగ్రహం పెరుగుతుంటుంది కనుక దానిని టిడిపిపైకి మళ్లించి ఈసారి వైసీపియే ‘మేలు’ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇంతకాలం అందరికీ మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న వైసీపి ప్రభుత్వం చివరికి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలని కూడా తన ఎన్నికల చదరంగంలో పావులుగా వాడుకోవడం ఎంత దుర్మార్గం?

ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్న అందరికీ ‘మేలు’ చేస్తున్నానని గొప్పగా చెప్పుకునే జగన్మోహన్‌ రెడ్డి, ఎన్నికలలో టిడిపిని దెబ్బ తీసేందుకు ఆడుగుతున్న ఈ మైండ్ గేమ్స్ చూస్తుంటే, వైసీపి తాపత్రయం అంతా అవ్వాతాతల ఓట్ల కోసమే కానీ వారిపై ప్రేమతో కాదని స్పష్టమవుతోంది.