మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ, ఆయన సతీమణిని ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం, ఆయనపై రాజధాని భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ అవకతవకలకు పాల్పడ్డారంటూ మరో కేసు నమోదు చేయడంపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ, గత ఏడాది తనను విచారణ పేరుతో ఓ గదిలో నిర్బందించి చిత్రా హింసలు పెట్టారని, అది రికార్డింగ్ కాకుండా ముందే గదిలోని సిసికెమెరాలు తొలగిస్తారని చెప్పారు. ప్రముఖులను చిత్రహింసలు పెడుతున్న విషయం బయట ఎవరికీ తెలియకుండా ఉండేందుకు సిబ్బందిని పంపించేస్తారని రఘురామ చెప్పారు. గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు క్రూరమృగాల కంటే ఘోరంగా ప్రవర్తిస్తారని చెప్పారు.
గత ఏడాది తనను పోలీసులు చిత్రహింసలు పెట్టినట్లే ఇప్పుడు విచారణ పేరిట నారాయణను కూడా చిత్రహింసలు పెడతారని, దానికి ఆయన తట్టుకోగలరో లేదో తెలీదు. కనుక ఆయన క్షేమం కోరే బంధుమిత్రులు తక్షణమే కోర్టులో కేసు వేసి చిత్రహింసల నుంచి ఆయనను కాపాడుకోవాలని రఘురామ సూచించారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభలో నారాయణ కాలేజీ నుంచే పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పిన మర్నాడే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా లీక్ కాలేదని అన్నారని, ఆ వార్త సాక్షి మీడియాలో కూడా వచ్చిందని ఆ పేపర్ కటింగ్ మీడియాకు చూపించారు.
ముఖ్యమంత్రి పేపర్లు లీక్ అయ్యాయని చెప్పినప్పుడు విద్యాశాఖ మంత్రి కాలేదని చెపితే ఎవరి మాట నమ్మాలి?ఒకవేళ ముఖ్యమంత్రి మాటలే నిజమైతే కాలేదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణను కూడా అరెస్ట్ చేయాలి కదా?ఒకవేళ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినదే నిజమయితే అప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా?అని రఘురామ ప్రశ్నించారు.
ఒక కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళుతుండగానే మరో కొత్త కేసు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను, వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తారా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏవిదంగా పనిచేస్తోందో.. అప్రజాస్వామ్య పాలన ఏవిదంగా సాగుతోందో తెలుసుకొనేందుకు ఈ కొత్త కొత్త కేసులు, అరెస్టులే తాజా నిదర్శనమని రఘురామ అన్నారు.



