జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం ఓట్లను టిడిపికి ధారాదత్తం చేయబోతున్నారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. అయితే కాపు సామాజికవర్గంలో ఎంతమంది పవన్ కళ్యాణ్‌కి అండగా ఉన్నారు?అని చూస్తే వారిలో ఆయనను ఓ సినిమా హీరోగా అభిమానించే యువత తప్ప కులపెద్దల పేర్లు వినబడవు.
కానీ వైసీపీ పాలనపై రాష్ట్రంలో కాపులు కూడా చాలా గుర్రుగా ఉన్నారు కనుక, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాలని అనుకొంటున్నారు గనుక, వారివైపు మొగ్గుచూపుతారని వైసీపీ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే, రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెట్టగల రాజకీయ, పరిపాలనానుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అన్ని కులమతాలవారినీ కలుపుకుపోతారు గనుక.
అందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని కలిసిన ప్రతీసారి, పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన ప్రతీసారి సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు వారిని ఒంటరిగా పోటీ చేయగలరా? అంటూ సవాళ్ళు విసురుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ అవడంతో, వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు కలిసి పనిచేయడం ఖాయమనే సంకేతాలు పంపారు.
కనుక వీరి కూటమివైపు రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం మొగ్గు చూపిన్నట్లయితే వైసీపీ తీవ్రంగా నష్టపోతుంది. కనుక వీరిని ఢీకొనేందుకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంని రంగంలో దించేందుకు వైసీపీ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా తుని రైల్వేకేసు నుంచి ఆయనకు విముక్తి కల్పించింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలలోకి వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు ఓ బహిరంగలేఖ విడుదల చేశారు. త్వరలోనే తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అయితే వైసీపీ, దాని అధినేత జగన్ తీరు గురించి బాగా తెలుసు కనుక ముద్రగడ పద్మనాభం బహుశః వైసీపీలో చేరే సాహసం చేయకపోవచ్చు…. కానీ వైసీపీ కోసమే రాష్ట్ర రాజకీయాలలోకి వస్తున్నట్లు భావించవచ్చు.
సినిమాలలో అలవాటు వలన పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలు కాస్త నాటకీయంగా ఉంటాయి కనుక కాపు కులపెద్దలు, పవన్ కళ్యాణ్ మాటలను నమ్మకపోవచ్చు. కానీ ముద్రగడ వంటి పెద్దాయన ముందుకు వస్తే ఆయన వెనక నిలిచేందుకు అందరూ కదిలిరావచ్చు. ఆయనకున్న ఈ కులబలాన్ని వైసీపీ వాడుకోవాలని భావిస్తే విచిత్రం కాదు.
ఆయన వైసీపీలో చేరకపోయినా, కాపు ఓట్లు చీల్చి టిడిపి-జనసేనలను దెబ్బ తీస్తే వైసీపీకి చాలు లేదా వైసీపీ సహాయసహకారాలతో ఆయనే కొన్ని సీట్లు గెలుచుకొని ఎన్నికల ఆ తర్వాత వైసీపీలో కలిపేసినా మరీ మంచిదే.
అంటే చంద్రబాబు నాయుడుకి కాపు ఓట్లు సాధించిపెట్టడం కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నట్లే, వైసీపీ కోసం ముద్రగడ పనిచేయబోతున్నారనుకోవచ్చు. కనుక రాష్ట్రంలో కాపు సామాజికవర్గం ప్రజలు ఏదో ఓ పార్టీకి ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా, గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడినపెట్టేందుకు తోడ్పడాల్సిన బాధ్యత ఉంది.



