ఎవరైనా తెలంగాణలో ఏం జరుగుతోందయ్యా అంటే తడుముకోకుండా ‘అభివృద్ధి’ అని సమాధానం చెపుతారు. మరి ఏపీలో ఏం జరుగుతోందయ్యా అంటే ‘రాజకీయాలు’ అని చెపుతారు.
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయం నుంచే మొదలైన ఈ రాజకీయాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. అవి నేడు భౌతికదాడులు, హత్యల వరకు వచ్చేశాయి. అంటే రాజకీయాలలో అధమస్థాయికి చేరుకొన్నట్లే!
ఇంతకాలం ఏపీలో వైసీపీ- టిడిపి, జనసేనల మద్యనే ఈ రాజకీయ చదరంగం సాగుతుండేది. కానీ ఇప్పుడు బిజెపి కూడా ప్రవేశించి పావులు కదపడం మొదలుపెట్టడంతో ఏపీలో రాజకీయాలు మరో స్థాయికి చేరాయి.
గత నాలుగేళ్ళుగా ఏపీ భ్రష్టు పట్టిపోతున్నా ఏనాడూ కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టలేదు. పైగా తనవంతుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మిపడేస్తోంది. ప్రత్యేక హోదా హామీని చెత్తబుట్టలో పడేశామని చెపుతోంది. రైల్వే జోన్ కధను వెబ్ సిరీస్‌గా మార్చేసింది. నాలుగేళ్ళుగా వైసీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు స్తంభాలాట ఆడుతున్నా పట్టించుకోలేదు.
రాష్ట్ర అప్పులుకుప్ప మరింత పెరిగేందుకు తనవంతు సాయం చేసింది. వివేకా హత్యకేసుని మూడడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కి నడిపిస్తూ అందరినీ గుప్పెట్లో ఉంచుకొంది.
వైసీపీ ప్రభుత్వానికి నాలుగేళ్ళుగా ఇంతగా సహాయసహకారాలు అందించిన మోడీ ప్రభుత్వం, హటాత్తుగా వైసీపీ ప్రభుత్వం ఓ అవినీతి ప్రభుత్వమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకరంగా ఉన్నాయని, అమరావతిని నాశనం చేసిందని విరుచుకుపడింది.
బిజెపిలో టిడిపి కోవర్టులు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ నే నడ్డా, అమిత్ షాలు చదివారని, టిడిపి ట్రాప్‌లో బిజెపి చిక్కుకొందని వైసీపీ సున్నితంగా విమర్శించింది.
అయితే బిజెపిని దేశమంతటా విస్తరింపజేసిన అపర రాజకీయ చాణక్యులు మోడీ, అమిత్ షాలు టిడిపి ట్రాప్‌లో పడ్డారనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది కదా?
నిజానికి వైసీపీ, బిజెపిలు రెండూ కలిసి టిడిపిని మరోసారి కోలుకోకుండా దెబ్బతీసేందుకే ఈ సరికొత్త మైండ్ గేమ్ ఆడుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
టిడిపికి శాస్వితంగా బిజెపి తలుపులు మూసేశామన్న అమిత్ షా హటాత్తుగా తలుపులు తెరిచి చంద్రబాబు నాయుడుని కౌగలించుకొన్నారంటే నమ్మశక్యంగా ఉందా?అంటే లేదనే అర్దమవుతోంది. ఎందుకంటే అన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఇబ్బందిపడటం కంటే, కేసులు, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగా తమతో అణగిమణిగి ఉండే జగన్మోహన్ రెడ్డితో స్నేహమే ఎక్కువ లాభం అని మోడీ, అమిత్ షాలు లెక్కకట్టుకొనే ఉంటారు.
కనుక వైసీపీ-బిజెపిలు శత్రువులులా కత్తులు దూసుకొంటూ మైండ్ గేమ్ ఆడుతూ టిడిపినే ట్రాప్ చేసేతున్నాయేమో?అనే అనుమానం కలుగుతోంది.
అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందంటే హనుమంతుడికి తన బలం తనకు తెలియదన్నట్లు, చంద్రబాబు నాయుడుకి కూడా తన బలం తాను తక్కువగా అంచనా వేసుకొంటూ వైసీపీని ఎదుర్కోవాలంటే మోడీ, అమిత్ షాల సహకారం అవసరమనే ఆలోచన చేస్తుండటమే! కనుక ఈ బలహీనత నుంచి టిడిపి ఎంత త్వరగా బయటపడి ఎన్నికలకు సిద్దమయితే అంతా మంచిది. లేకుంటే ఈ మైండ్ గేమ్స్‌లో మరోసారి టిడిపి నష్టపోతే, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోతుంది. అప్పుడు ఏపీని చంద్రబాబు నాయుడు కూడా కాపాడలేరు!



