మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. అది ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంగా కాక ఏదోలాగా కోటి సంతకాలు పూర్తి చేయించేస్తే చాలన్నట్లు ప్రైవేట్ కార్యక్రమంగా సాగిపోతోంది. కనుక ఈ కార్యక్రమం అసలు ప్రయోజనమే నెరవేరడం లేదు.
కానీ ఈ పేరుతో వైసీపీ చేస్తున్న హడావుడి చూస్తున్నప్పుడు ఎవరికైనా కొన్ని సందేహాలు తప్పక కలుగుతాయి. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి మెజార్టీతో పాలించింది. మూడు రాజధానులు, విశాఖ రాజధాని ఏర్పాటు చేయలేకపోయినా కనీసం అప్పుడే 17 మెడికల్ కాలేజీలు కట్టించి ఉండవచ్చు కదా?
జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళలో 17 మెడికల్ కాలేజీలు కట్టించలేని దయనీయ స్థితిలో ఉందా?అంటే కాదని విశాఖలో రుషికొండపై విలాసవంతమైన ప్యాలస్‌లు చెపుతున్నాయి.
సుమారు రూ.500 కోట్లతో వాటిని నిర్మించుకోవడంపై చూపిన శ్రద్ధ, పట్టుదల మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చూపి ఉంటే వాటి నిర్మాణాలు అప్పుడే పూర్తయ్యి ఉండేవి కదా?
వాటన్నిటికీ జగన్ పేరుతో శిలాఫలకాలు వేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేసుకొని ఉంటే, ఆ క్రెడిట్ పూర్తిగా ఆయనకీ, వైసీపీకే దక్కి ఉండేది కదా? నేడు ఇలా కోటి సంతకాలంటూ తిప్పలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా?







