యువరాజ్ 6 సిక్సర్లకు 9 ఏళ్ళు… ఇప్పటికీ కెవ్వుకేకే..!

Yuvraj 6 sixes vs england 2007 t20 world cup 2007, సెప్టెంబర్ 19వ తేదీన ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే… బహుశా ఏ సెలబ్రిటీ పుట్టినరోజో గుర్తుకు వస్తుంది. కానీ, యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఘటన అని అడిగితే, వెంటనే గుర్తొస్తుంది. గుర్తుకు రావడమేంటి… మళ్ళీ యూ ట్యూబ్ లో ఆ వీడియోను ఒకసారి చూసి మరీ ఆనందించడం క్రికెట్ ప్రేమికుల వంతవుతుంది. సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ వరల్డ్ టీ-20 పోటీలు జరుగుతున్న వేళ, డర్బన్ లోని కింగ్స్ మేడ్ మైదానం వేదికగా, యువీ సాధించిన ఈ ఫీట్ చరిత్రలో నిలిచిపోయింది.

ADVERTISEMENT

ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేస్తుండగా, ఒకదాని తరువాత మరో బాల్ ను పెవీలియన్ దారి మళ్లిస్తూ, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నాటి యువరాజ్ ఆటను బహుశా క్రికెట్ ప్రేమికులెవరూ మరచిపోలేరు. బాల్ బాల్ కూ బ్రాడ్ వ్యూహం మార్చినా, యువరాజ్ బ్యాట్ ముందు ఆ పప్పులుడకలేదు. ఆ ఘటన జరిగి నేటికి సరిగ్గా 9 సంవత్సరాలు. అప్పటికి వీరేంద్ర సెహ్వాగ్ 68 పరుగులతో, గౌతమ్ గంభీర్ 58 పరుగులతో బలమైన పునాదిని వేసిన వేళ, ఒత్తిడి లేని యువరాజ్ వచ్చి బ్యాటును ఝళిపిస్తే, మైదానంలోని ప్రేక్షకులంతా కేరింతలు పెట్టారు. కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన యువరాజ్, టీ-20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

అయితే ఆ ఆరు సిక్సర్లు సంధించడానికి ప్రధాన కారణం ఫ్లింటాఫ్ తో జరిగిన వాగ్వివాదం అన్న విషయం తెలిసిందే. బ్రాడ్ ఓవర్ కు ముందు పిచ్ లో యువరాజ్ ను ఉద్దేశించి ఫ్లింటాఫ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చెలరేగిపోయిన యువరాజ్, ఆకాశమే హద్దుగా బ్రిటన్లకు చుక్కలు చూపించాడు. వరుసగా ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్, మరుసటి ఓవర్లో ఫ్లింటాఫ్ కు కూడా ఫస్ట్ బాల్ కే సిక్స్ ఇచ్చి, తన సత్తా ఏ పాటిదో చాటిచెప్పాడు. అయితే మరో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటైనప్పటికీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం జరిగిన 9 కాదు, మరో 9 సంవత్సరాలు గడిచినా యువరాజ్ చేసిన ఈ ఫీట్ ను అంత తేలికగా మరచిపోవడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.

ADVERTISEMENT
Latest Stories