గులాబ్ జామ్ చూస్తే నోరూరుతుంది. కానీ నోట్లో వేసుకోవాలంటే షుగర్ పెరిగిపోతుందని భయం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అధికార, ప్రతిపక్షాలకు ఇలాగే మారాయి. ఇవి కూటమి ప్రభుత్వానికి ఒకరకమైన సమస్యలు సృష్టిస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి మరో రకమైన సమస్యలు సృష్టిస్తున్నాయి.
కూటమిలో భాగస్వామి పార్టీలకు, ముఖ్యంగా.. జనసేనకు ఎన్ని సీట్లు?అంటూ ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు తమ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. వారు కోరినట్లే “మనకు బలం ఉన్న చోట మనమే పోటీ చేద్దాం. సీట్ల సంగతి నేను చూసుకుంటాను. మీరు బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసుకొని సిద్ధంగా ఉండండని,” పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఏ రాజకీయ పార్టీకైనా గ్రామస్థాయిలో బలమే చాలా ముఖ్యం. ఎందుకంటే, నగరాలు, పట్టణాలలో ఓటర్లను నమ్ముకోలేవు. కనుక గ్రామస్థాయిలో బలం ఉంటేనే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో విజయావకాశాలు మెరుగవుతాయి.
ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో మిత్రపక్షాల కోసం చాలా త్యాగాలు చేశామని, కనుక స్థానిక సంస్థల ఎన్నికలలో మన సీట్లు వాటికి పంచిపెట్టేయవద్దని టీడీపి శ్రేణులు కోరుతున్నాయి.
అయితే, సిఎం చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, “సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా వెంటనే ఎన్నికలు నిర్వహిస్తాము. కనుక అందరూ సిద్దంగా ఉండాలి. ఎవరికెన్ని ఓట్లు అని కాదు. ఎవరికీ ఎక్కడ బలం ఉందో చూసి బలమైన అభ్యర్ధులను నిలబెడదాం. నిలబెట్టిన ప్రతీ అభ్యర్ధిని గెలిపించుకుందాం. గెలుపే ముఖ్యం,” అని అన్నారు.
ఇదే సరైన పద్దతి కూడా. బలం ఉన్నచోట బలమైన అభ్యర్ధినే నిలపాలి తప్ప మిత్ర ధర్మం పాటించి ఎవరో ఒకరిని నిలబెడితే ఆ సీటు వైసీపీ ఎగరేసుకు వెళ్ళిపోతుంది.
కానీ ఎక్కడ ఎవరికెంత బలం?అనే లెక్కలు తీస్తే ఇగోలు, మనోభావాలు దెబ్బ తినేస్తాయి. కనుక కూటమి పార్టీలకు ఈ ఎన్నికలు షుగర్ పేషెంటు ఎదుట గులాబ్ జామ్ వంటివే. ఎవరు ఎంత ముక్క తినాలో బాగా ఆలోచించుకోవాలి.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ లేదా కూటమికే మెజార్టీ సీట్లు దక్కుతాయి. కనుక జగన్ ఓటమికి ముందే సిద్దపడి, “ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు. జరిగితే మనమే గెలుస్తాం,” అని ఒక ఓపెనింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
దాంతో పాటు ఏకగ్రీవాలు జరిగితే వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని హెచ్చరించారు కూడా. కనుక ఆ కోటాలో కొంతమంది పోతారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సజ్జలకు, జగన్‌కు మద్య భేదాభిప్రాయాలు వచ్చాయని, అందుకే సజ్జలని పక్కన పెట్టేసి జగన్ స్వయంగా పార్టీ నేతలతో సమావేశమయ్యి దిశానిర్దేశం చేస్తున్నారని గిట్టనివారు చెవులు కోరుకుంటున్నారు.
కనుక ఇది కూడా వైసీపీలో అయోమయం సృష్టిస్తోంది. ఇక ఈ ఎన్నికలకు ముందు వైసీపీలో నుంచి టీడీపి, జనసేనలోకి వలసలు మొదలవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా సంక్రాంతికి హైదరాబాద్ ఖాళీ అయిపోయినట్లు విజయనగరం జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతోంది.
కానీ ఎలాగూ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగవు (మనం గెలవం) అని జగన్ ముందే చెప్పేశారు కనుక ఎవరూ ఆవేశపడి జేబులో డబ్బు ఖర్చు పెట్టేసుకోనవసరం లేదు! ఊరికే టెన్షన్ పడక్కరలేదు. కానీ ప్రజలు మనవైపే ఉన్నారని నిరూపించుకోవడం కోసం అయిష్టంగానైనా ఈ గులాబ్ జామ్ కాస్త నోట్లో వేసుకోక తప్పదు.





