నాడు గంగూలీ… నేడు విరాట్ కోహ్లి…!

2017 ICC Champions Trophy - INd Vs Pak2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నుండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… 2003 వరల్డ్ కప్ ఫైనల్ కు వెళితే… లీగ్ మ్యాచ్ లలో, సెమీ ఫైనల్స్ లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక అక్కడితో మొదలైన టీమిండియా బ్యాడ్ లక్, ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్లలో 360కి పైగా పరుగులు చేయడంతో, మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు అభిమానులు.

దానికి తోడు టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడానికి కారణమైన సచిన్ టెండూల్కర్ తొలి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టడంతో… గంగూలీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే… గంగూలీ నిర్ణయం వలనే టీమిండియా ఓటమి పాలైందని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు తూర్పారపట్టారు. అయితే జరిగి దశాబ్దం పైనే గడిచినా, ఇప్పటికీ ఆ క్షణాలు అభిమానుల కళ్ళ ముందు తళుక్కుమంటూనే ఉన్నాయి. ఫైనల్స్ లో తొలుత బౌలింగ్ ఎంచుకోవడం నుండి టీమిండియా పాఠాలు నేర్చుకోలేదన్న విషయం 2017 ఫైనల్స్ సందర్భంగా కూడా తెలిసి వచ్చింది.

ADVERTISEMENT

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో కీలకమైన టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత బౌలింగ్ ఎంచుకోవడం విమర్శలకు దారి తీసింది. అవకాశం వచ్చి కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచాల్సింది పోయి, యువ పాక్ క్రికెటర్లకు స్వేఛ్చనిచ్చే విధంగా బౌలింగ్ ఎంచుకోవడం ఒక విధంగా నాడు వరల్డ్ కప్ ను ఎలాగైతే ఆసీస్ కు అప్పచెప్పారో, నేడు విరాట్ కోహ్లి కూడా అదే పని చేసారని అభిమానులు మండిపడుతున్నారు. దాని ఫలితమే తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఏకంగా 338 పరుగుల భారీ స్కోర్ ను నెలకొల్పింది.

దీనికి తోడు చేజింగ్ లో తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ కావడం, మూడవ ఓవర్ లో విరాట్ కోహ్లి కూడా పెవిలియన్ చేరుకోవడం, ఆ కాసేపటికే శిఖర్ ధావన్ కూడా ఔటవ్వడంతో దాదాపుగా టీమిండియా విజయంపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక్కడ నుండి టీమిండియా గెలవాలంటే ఏదొక అద్భుతం జరగాల్సిందే. ఎందుకంటే ఆ విధంగా పాక్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్లను కట్టడి చేయడంలో సఫలీకృతం అవుతున్నారు. ఫైనల్స్ లో ఒత్తిడి ఉంటుంది గనుక, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కూడా నిరూపించింది.

ADVERTISEMENT
Latest Stories