ఇంతకాలం ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ దేశంలో రాజకీయ పార్టీలను ఎన్నికలలో గెలిపించే కాంట్రాక్టులు తీసుకొని దేశంలో సరికొత్త రకం బిజినెస్ ప్రవేశపెట్టారు. కానీ పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు అయన వ్యూహాలు, ఆయన సొంత పార్టీకి ఫలించలేదు.
ఇప్పుడు చర్చ ఆయన గురించి కాదు.. దేశ రాజకీయాలను శాశించాలనుకునే అయన వంటి అభిజీత్ దీప్కే గురించి. ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా రాజకీయాలను వ్యూఃల ద్వారా శాశింఛి లబ్ది పొందాలనుకుంటే, అభిజీత్ దీప్కే మరో రకంగా ప్రయత్నిస్తున్నారు.
తొలి ప్రయత్నంలోనే కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడంతో, ఆ స్పూర్తితో దేశంలో ప్రతిపక్షాలు అదే పద్దతిలో అధికార పార్టీలను బలహీన పరచాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు అభిజీత్ ఉత్సాహం ఆపుకోగలరా? ఒకవేళ ఆపుకున్నా అయన వెనుకున్న రాజకీయ శక్తులు ఊరుకోనిస్తాయా?
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) పట్ల దేశంలో ప్రతిపక్షాలు, కొన్ని శక్తులు, కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నమాట వాస్తవం. కనుక వారి అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని కేంద్రంపై ప్రయోగించేందుకు అభిజీత్ మరోసారి సిద్దమవుతున్నట్లున్నారు.
కనుక ఈసారి కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చేయకుంటే ఈసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి ముంబయిలో జెన్-జీలతో ఆందోళనలు మొదలుపెడతామని గడువు పెట్టి హెచ్చరించారు. బొద్దింకలనుకుంటున్న జెన్-జీ నిజానికి పులులని వాటి శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు.
కనుక అభిజీత్ ఒత్తిడికి తలొగ్గి జ్ఞానేశ్వర్ కుమార్ కూడా రాజీనామా చేస్తారా? చేయకపోతే మరో రాజీనామా డిమాండ్‌తో అభిజీత్ ముంబైలో చేపట్టబోయే ఆందోళనలకు మళ్ళీ జెన్-జీ తరలివచ్చి మద్దతు ఇస్తుందా? మళ్ళీ దేశంలోని ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇస్తాయా? లేదా అనేది మున్ముందు తెలుస్తుంది.
అయితే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ఎన్నికల ప్రక్రియని బహిష్కరించాలని అభిజీత్ ప్రతిపక్ష పార్టీలకు పిలుపునివ్వడం వివాదాస్పదంగా ఉంది.
కాక్రోచ్ జనతా పార్టీ అధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా పలు ప్రతిపక్షపార్టీలు సంఘీభావం ప్రకటించాయి. కనుక అవన్నీ తన నాయకత్వంలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నాయనే భ్రమతో అభిజీత్ ఈవిధంగా మాట్లాడుతున్నారా అనే సందేహం కలుగుతుంది.
అభిజీత్ చెప్పినట్లు మన ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఉన్నమాట నిజం. కానీ క్యాన్సర్ సోకినా శరీరంలో ఆ భాగాన్ని మాత్రమే తొలగించుకొని ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటారు తప్ప ఎవరూ ప్రాణాలు తీసుకోరు కదా?
అలాగే మన ఎన్నికల ప్రక్రియలో కనిపిస్తున్న లోపాలకు ఎన్నికల బహిష్కరణే పరిష్కారం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.
అభిజీత్ దీప్కే తాను జెన్-జీ ప్రతినిధినని, సరికొత్త ఆలోచనలు చేయగల తెలివితేటలున్నాయని బలంగా నమ్ముతున్నప్పుడు నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలి కదా?
మన దేశ రాజకీయాలను, వ్యవస్థలను ఇంత దగ్గర నుంచి చూస్తున్న అభిజీత్ దీప్కే, దేశాన్ని చక్కదిద్ది గాడిన పెట్టగలమని నిరూపించుకుంటే అందరూ హర్షిస్తారు. ఆయనకు జేజేలు పలుకుతారు.
కానీ నిత్యం ఎవరో ఒకరిని ఏదో కారణం చూపుతూ రాజీనామా చేయాలంటూ బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆందోళనలకు పిలుపునివ్వడం, ఇప్పుడు ఏకంగా ఎన్నికలను బహిష్కరించమని ప్రతిపక్షాలకు పిలుపునివ్వడం వంటివి ప్రజల దృష్టిలో ఆయన గుర్తింపును పోగొట్టుకునేలా చేస్తాయని చెప్పక తప్పదు.
శిఖరం వరకు చేరుకోవడం ఎంత కష్టమో, అక్కడకు చేరుకున్నాక కిందకు జారిపడకుండా నిలబడటం కూడా అంతే కష్టం. అభిజీత్ దీప్కే ఇంకా శిఖరం చేరుకోలేదు.





