తాతల తండ్రుల నుంచి మన దాకా రామాయణం ఎన్ని రూపాల్లో వచ్చిందో చెప్పడం కష్టం. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి ఆప్షన్లు ఎక్కువయ్యాయి కానీ దూరదర్శన్ జమానా ఈ సీరియల్ వచ్చే సమయంలో రోడ్డు మీద ఒక్కడుంటే ఒట్టు. సాంకేతిక లేని రోజుల్లో అది అంత అద్భుతం చేయగలిగినప్పుడు ఇప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్ తో వండర్స్ చేయొచ్చుగా. అందుకే ఆదిపురుష్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ దానికి తోడవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ వర్షంలా పోటెత్తాయి.
ఇందులో మనకు తెలియని కథేమీ లేదు. సీత(కృతిసనన్)ను రావణాసురుడు(సైఫ్ అలీఖాన్) ఎత్తుకెళితే వానర సైన్యం సహాయంతో రాముడు(ప్రభాస్) శత్రుసంహారం చేసి ధర్మపత్నిని వెనక్కు తీసుకురావడం వరకు దర్శకుడు ఓం రౌత్ తీసుకున్నాడు. ఇక్కడ రెండు అంశాలు కీలకంగా పరిగణన లోకి తీసుకోవాలి. మొదటిది రామాయణాన్ని విజువలైజ్ చేసే పద్ధతి. రెండోది ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా పాత్రలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత. గతంలో వచ్చిన వాటికంటే ఇది విభిన్నంగా ఉందనిపించాలంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల పరిచయాలు వాటి మధ్య డ్రామాతో ఓం రౌత్ ఇంటర్వెల్ దాకా తన బాధ్యతను బాగానే నిర్వర్తించాడు. విసుగు రాకుండా గడిచిపోతుంది. అయితే రాముడికి మాస్ హీరోయిజం కోటింగ్ ఇవ్వాలని పడిన తాపత్రయం సెకండ్ హాఫ్ నుంచి పక్కదారి పట్టించేసింది. యుద్దాన్ని గ్రాఫిక్స్ డామినేట్ చేశాయి. దీని వల్ల రామ రావణులు మొదటిసారి కలుసుకున్న ఎపిసోడ్ అంతగా హైప్ ఇవ్వలేకపోయింది. రావణుడి గెటప్, హెయిర్ స్టయిల్, ఒంటి మీద పాములు పాకించుకోవడం, ఓ పెద్ద రాకాసి గుడ్లగూబ లాంటి వాహనాన్ని వాడటం రావణ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించాయి.
గ్రాఫిక్స్ సంగతి ఎలా ఉన్నా కీలకమైన రావణుడిగా సైఫ్ అలీఖాన్ తో చేయించిన ప్రయత్నం అంతగా ఫలితం ఇవ్వలేదు. ఎమోషనల్ గా సీతారాముల మధ్య ప్రేమ తెరమీద అంతగా పండలేదు. విజువల్ గా ఆకట్టుకునే ప్రయత్నం తప్ప నిజంగా రామాయణంలోని ఆత్మను తెరమీద ఆవిష్కరిస్తున్నది లేనిదీ ఓం రౌత్ చెక్ చేసుకోలేదు. దీంతో హాలీవుడ్ టీమ్ మన ఇతిహాసాన్ని తీస్తే ఎలా ఉంటుందో ఆదిపురుష్ అలా వచ్చింది. అంతమాత్రాన హై స్టాండర్డ్ అని కాదు దానర్థం. ఖరీదైన సూటు తొడిగారు కానీ లోపల చొక్కా పాతదే.
పోస్టర్లలో రాముడిగా మెప్పించిన ప్రభాస్ స్క్రీన్ మీద బెస్ట్ అనిపించుకోలేదు కానీ మరీ నెగటివ్ ముద్ర పడకుండా ఉండేందుకు కష్టపడ్డాడు. కృతి సనన్ కు దక్కిన స్కోప్ తక్కువ. సైఫ్ అలీఖాన్ దశకంఠుడిగా కన్నా ముంబై మాఫియా డాన్ లా అనిపించి ఆ పాత్ర తాలూకు గాంభీర్యాన్ని ఓవర్ లౌడ్ లో ప్రదర్శించాడు. సంగీతం ఆదిపురుష్ ప్రధాన బలంగా నిలిచింది. గ్రాండియర్ నెస్ కి లోటు లేని ఈ మాడరన్ రఘురాముడిని పిల్లలతో కలిసి చూడొచ్చు. కానీ అంచనాలు పరిమితంగా, తర్కాలకు దూరంగా ఉంటేనే సుమా.



