కల్వకుంట్ల కవితకు ఈడీ మళ్ళీ నోటీస్… మళ్ళీ డ్రామా?

Kalvakuntla Kavitha

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ కుమార్తె, బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్ళీ ఈడీ నోటీస్ పంపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు మంగళవారం ఢిల్లీలో తమ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులో కోరింది. ఆమె ఆ నోటీసును చాలా లైట్ తీసుకుంటూ, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసుని (ఈడీ కార్యాలయంలో మహిళ అయిన తనను ప్రశ్నించడం) విచారిస్తున్నందున విచారణకు హాజరుకాలేనని వెంటనే సమాధానం పంపారు. సుప్రీంకోర్టు ఈ కేసుని గత ఏడాది నవంబర్‌లో మళ్ళీ విచారణ చేపట్టవలసి ఉండగా విచారణ జరపకపోవడంతో ఈడీ ఆమెకు మళ్ళీ నోటీసు పంపింది.

ఏనుగు పైకి ప్రదర్శించే దంతాలు, ఆహారం నమిలి తినే దంతాలు వేర్వేరుగా ఉంటాయని అందరికీ తెలుసు. ఈ కేసులు, విచారణ, హడావుడి అంతా ఏనుగు దంతాలలా ప్రజలకు చూపేందుకు మాత్రమే. అయితే ఈ కేసులన్నీ తమ రాజకీయ ప్రత్యర్ధులను కరకర నమిలేసేందుకే ఎక్కువగా వాడుకొంటున్నాయి అధికార పార్టీలు. దీనికి తాజా ఉదాహరణలుగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు, చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన కేసులు కనబడుతున్నాయి.

ADVERTISEMENT

అయితే గమ్మతైన విషయం ఏమిటంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నిందితులను ఈడీ రకరకాలుగా ‘డీల్’ చేస్తుంటుంది. ఢిల్లీలో బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన కేజ్రీవాల్ అండ్ కోని ఈ కేసుతో ఉక్కుపాదంతో అణచివేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇదే కేసులో ప్రదాన నిందితుడుగా పేర్కొన్న ఏపీ వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈడీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు! కానీ కల్వకుంట్ల కవితకి విచారణ పేరుతో నోటీసులు పంపుతోంది… ఎందుకు?

అంటే దీనికి చిన్న ఫ్లాష్ బ్యాక్‌ ఉంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రధాన అభ్యర్ధులపై ఐ‌టి దాడులు చేయించి బిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా సహకరించింది. అందుకు ప్రతిగా బిఆర్ఎస్‌ కూడా సహకరించడం వలన బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోగలిగింది.

ఆ ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓడిపోయింది. అది వేరే విషయం! ఆ ఎన్నికలలో రెండు పార్టీలు లోపాయికారీ సహకరించుకోవడం వలన అవి విశ్వసనీయత కోల్పోయాయి. కానీ వాటికి విశ్వసనీయతపై పెద్ద పట్టింపు లేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో గెలవడమే రెంటికీ చాలా ముఖ్యం.

కనుక మళ్ళీ బీజేపీ, బిఆర్ఎస్‌ మళ్ళీ పరస్పరం విమర్శలు చేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నాయి. వాటి ఈ డ్రామాలో భాగంగానే కల్వకుంట్ల కవిత ఈడీ నోటీసులనుకోవచ్చు. అవసరమైతే కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసినా చేయవచ్చు. చేస్తే ఏమవుతుంది?అంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తుంది. దాంతో ప్రజలు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలలో చెరోవైపు చేరుతారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. కనుక లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు బిఆర్ఎస్‌, బీజేపీలు ఈ డ్రామాని రక్తి కట్టించడం తధ్యం.

ADVERTISEMENT
Latest Stories