“అజ్ఞాతవాసి” ట్రైలర్ – ది బెస్ట్ జోక్!

Agnyaathavaasi Trailer Talk, Agnyaathavaasi Trailer Views Record Countఇటీవల కాలంలో అభిమానుల సహనాన్ని పరీక్షించడంలో చిత్ర నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయోమో అనిపించేలా ట్రైలర్ మరియు టీజర్ రిలీజ్ ముహూర్త సమయాలు నిలుస్తున్నాయి. తొలిసారిగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ “1 నేనొక్కడినే” సినిమా ట్రైలర్ తో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులను ఒక ఆట ఆడుకోగా, ఆ తర్వాత దాదాపుగా ప్రతి నిర్మాణ సంస్థ ఇదే బాటలో పయనిస్తోంది. ఫలానా సమయానికి ట్రైలర్ రిలీజ్ అని చెప్పడం… దాని కోసం కళ్ళు కాయలు కాచేలా అభిమానులు ఎదురుచూడడం… తీరా ఆ సమయం గడిచినా… చిత్ర యూనిట్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడం… ఇటీవల కాలంలో షరామామూలుగా మారిపోయింది.

ఇందుకు పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినీ నిర్మాణ సంస్థ కూడా ఏమీ భిన్నం కాదని నిరూపించుకుంది. విడుదలకు కేవలం మూడు రోజుల సమయాన్ని మాత్రమే పెట్టుకుని ఉన్న తరుణంలో… ట్రైలర్ రిలీజ్ సమయాన్ని ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ, అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో విఫలమైంది. దీంతో “అజ్ఞాతవాసి ట్రైలర్”ను ట్యాగ్ లైన్ చేస్తూ ఓ ఆట ఆడుకోవడం నెటిజన్ల వంతయ్యింది. నెటిజన్లకు, సినీ అభిమానులను ఇలాంటి విషయాలు కొత్త కాకపోవడంతో, జోక్ ల మీద జోక్ లు పెడుతూ… ‘జిఫ్’ ఇమేజ్ లను పోస్ట్ చేస్తూ తమ అనుభూతులను తెలియజెప్తున్నారు.

ADVERTISEMENT

అయితే వాటన్నింటిలోకల్లా ఓ జోక్ మాత్రం ‘ది బెస్ట్’ అనిపించుకుంది. “అజ్ఞాతవాసి” ట్రైలర్ విడుదలను ప్రస్తుతం పోస్ట్ పోన్ చేస్తున్నాము, ఈ నెల 10వ తేదీన సినిమా విడుదలతో పాటు, ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తున్నాము. అన్నీ ధియేటర్లో ఎంజాయ్ చేయండి… అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతూ నెటిజన్లకు వినోదాన్ని పంచుతోంది. ఇలా ఒకటేమిటి… గతంలో ఇతర హీరోల ట్రైలర్స్ రిలీజ్ ఆలస్యం అయినపుడు పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో జోక్ లను, హేళనలు చేయగా, ఇప్పుడు అలాంటి అనుభూతులను చవిచూడడం పవన్ అభిమానుల వంతవుతోంది. మున్ముందు అయినా… చిత్ర నిర్మాణ సంస్థలు ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories