అక్కినేని అఖిల్ హీరోగా నటించిన రెండవ సినిమా “హలో” మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో… ఈ చిత్ర నిర్మాత, అఖిల్ తండ్రి నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. తాజాగా నాగ్ ‘ప్రెస్ మీట్’లో పాల్గొనగా, అఖిల్ మాత్రం మొహం చాటేయడంతో మొదటగా మీడియా నుండి అదే ప్రశ్న వెలువడింది.
ఇటీవల నాగ్ మరియు అఖిల్ లు ఇద్దరూ కలిసి ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న నేపధ్యంలో… విడుదలకు మరికొద్ది గంటలు ఉందనగా, అఖిల్ రాకపోవడం ఏంటి? అని ప్రశ్నించగా, గత వారం రోజుల నుండి “హలో” ప్రమోషన్ కార్యక్రమాలలోనే అఖిల్ నిమగ్నమై ఉన్నాడు. యుఎస్ లో ప్రమోషన్ ముగించుకుని, వెంటనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
వారం రోజులుగా చాలా అలసిపోయాడు. అందుకే ఈ రోజు ప్రెస్ మీట్ కు “నేనొక్కడినే” వచ్చానని నాగ్ సెలవిచ్చారు. ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రియాక్షన్స్ తో తన టెన్షన్ పోయిందని, రెండు నిముషాల పాటు అఖిల్ ను హత్తుకుని ఉండడంతో తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని, మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం, ఖచ్చితంగా కొట్టబోతున్నామనే నమ్మకాన్ని నాగ్ వెలిబుచ్చారు.



