భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. గతంలో విడుదలైన సినిమా ఎన్ని రోజులు ఆడితే అంత గ్రేట్. ఇప్పుడు ఎన్ని ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేస్తే అంత గ్రేట్. ఇక కలెక్షన్ల సంగతంటారా? తొలి రోజు కలెక్షన్లే సినిమా హిట్టా? ఫట్టా? అన్నది చెప్పేస్తున్నాయి. ఈ తొలి రోజు బిజినెస్ ను గుర్తించిన నిర్మాతలు కూడా తొలి రోజు విడుదలయ్యే థియేటర్లపైనే దృష్టిపెడుతున్నారు. దీంతో అన్ని భాషల చిత్ర పరిశ్రమలూ తొలిరోజు కలెక్షన్లపైనే దృష్టి పెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తొలిరోజు అత్యధిక గ్రాస్ సాధించిన బాలీవుడ్ సినిమాల జాబితాను ప్రముఖ బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ విడుదల చేశాడు. 2016 సంవత్సరానికి గానూ బాలీవుడ్ లో తొలి రోజు కలెక్షన్లలో టాప్ ఐదు సినిమాల్లో మూడు అక్షయ్ కుమార్ సినిమాలే ఉండడం విశేషం. ‘సుల్తాన్’ తొలి రోజు 36.54 కోట్లు వసూలు చేయగా, షారూఖ్ ‘ఫ్యాన్’ 19.20 కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకుంది.
ఇక, మూడు నుండి అయిదు వరకు అక్షయ్ బాబు హస్తగతం చేసుకున్నాడు. మూడో సినిమాగా ‘హౌస్ ఫుల్-3’ 15.21 కోట్ల రూపాయలతో ఉండగా, తాజాగా విడుదలైన ‘రుస్తుం’ సినిమా 14.11 కోట్ల రూపాయలతో నాలుగవ స్థానంలోనూ, ‘ఎయిర్ లిఫ్ట్’ 12.35 కోట్ల రూపాయలతో అయిదవ స్థానంలోనూ నిలిచి అక్షయ్ కుమార్ సత్తా చాటాయి.



